Telugu Global
Andhra Pradesh

సుప్రీంలో తేల్చుకుంటామన్న జగన్..

ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణంపై కూడా సుప్రీంతీర్పు ఫైనల్ కాబోతోందనమాట. సుప్రీం తీర్పు ప్రకారం అక్కడ స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అక్కడ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వడం వంటివి జరగాల్సి ఉంది.

సుప్రీంలో తేల్చుకుంటామన్న జగన్..
X

అమరావతి ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించడంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది. అయితే ఇదే విషయంలో సుప్రీంకోర్టులో అసలు కేసు పెండింగ్ లో ఉంది. ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో తుదితీర్పు సుప్రీం ఇవ్వాల్సి ఉంది. మధ్యంతర ఉత్తర్వులతో ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ ఇదివరకే పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇళ్లు కట్టడం మొదలుపెట్టే సరికి అమరావతి రైతులు హైకోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇళ్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీనిపై మరోసారి సుప్రీం మెట్లెక్కబోతోంది ఏపీ ప్రభుత్వం. అంటే.. ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణంపై కూడా సుప్రీంతీర్పు ఫైనల్ కాబోతోందనమాట. సుప్రీం తీర్పు ప్రకారం అక్కడ స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అక్కడ ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వడం వంటివి జరగాల్సి ఉంది.

అలా ఎలా అడ్డుకుంటారు..?

చంద్రబాబు అండ్ కో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతిలో ప్రైవేట్ కంపెనీలకు, కొన్ని కాలేజీలకు కూడా స్థలాలు ఇచ్చారని, వారు స్థానికేతరులు కాదా అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే, చంద్రబాబుకి కడుపుమంట దేనికన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంలోనే తేల్చుకుంటామని చెప్పారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్కడ సంబరాలు..

ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణాన్ని ఆపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో అమరావతి శిబిరంలో సంబరాలు జరుగుతున్నాయి. ఈ తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటున్నారు రైతు సంఘాల నేతలు. టీడీపీ నేతలు కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్పందించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ఇకనైనా కళ్లు నేలమీదకు దించాలంటూ సెటైర్లు వేస్తున్నారు.

First Published:  3 Aug 2023 2:15 PM GMT
Next Story