Telugu Global
Andhra Pradesh

ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీకి కారణం అదేనా..?

ప్రస్తుతం సింఘాల్ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న హరి జవహర్‌లాల్‌కు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీకి కారణం అదేనా..?
X

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ దగ్గర ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆర్పీ సిసోడియాను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అక్కడి నుంచి తప్పించిన ప్రభుత్వం ఆయనకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. సిసోడియా స్థానంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించింది.

ప్రస్తుతం సింఘాల్ దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌గా ఉన్న హరి జవహర్‌లాల్‌కు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. సిసోడియాను తప్పించడం.. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడం వెనుక కారణాలపైనా చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ నేతృత్వంలో ఒక బృందం గవర్నర్‌ను కలిసి జీతాలు చెల్లించడం లేదంటూ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది.

వీరికి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఎవరి ద్వారా దొరికిందన్న దానిపై ప్రభుత్వం కొంతకాలంగా ఆరా తీస్తోంది. ఉద్యోగుల బృందానికి గవర్నర్‌ను కలిసే అవకాశం దక్కడం వెనుక సిసోడియా సాయం ఉందన్న అనుమానంతోనే ప్రభుత్వం ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేసిందన్న వార్తలొస్తున్నాయి.

Next Story