Telugu Global
Andhra Pradesh

జస్టిస్ సోమయాజులుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం

ఏ న్యాయమూర్తికైనా విచారిస్తున్న కేసు విషయంలో విరుద్ధమైన ప్రయోజనాలు ఉంటే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు.

జస్టిస్ సోమయాజులుపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం
X

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుపై ఏపీ ప్ర‌భుత్వం మరోసారి అభ్యంతరం లేవనెత్తింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో నవయుగ కంపెనీతో ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం తొలుత రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థించింది. దీంతో నవయుగ సంస్థ డివిజన్ బెంచ్‌ ముందు అప్పీల్ చేసింది.

ఈ అప్పీల్ విచారణకు రాగా సదరు ధర్మాసనంలో జస్టిస్ డివీఎస్ఎస్‌ సోమయాజులు కూడా ఉన్నారు. అప్పీల్‌పై నవయుగ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించేందుకు సిద్ధమవ్వ‌గా.. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాం జోక్యం చేసుకున్నారు. అప్పీల్‌ను విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ సోమయాజులు ఉన్నారని.. ఆయన గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా పనిచేశారని ప్రధాన న్యాయమూర్తికి వివరించారు.

ఏ న్యాయమూర్తికైనా విచారిస్తున్న కేసు విషయంలో విరుద్ధమైన ప్రయోజనాలు ఉంటే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. అందుకే నవయుగ సంస్థతో గతంలో సోమయాజులు కలిసి పనిచేసిన అంశాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నామని.. జస్టిస్ సోమయాజులుపై తామేమి ఫిర్యాదు చేయడంలేదని కేవలం విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నామని ఏజీ వివరించారు.

ప్రభుత్వం లేవనెత్తిన విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి.. ఈ కేసును జస్టిస్ సోమయాజులు లేని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తామని ప్రకటించారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. కేసులో ఫలితం ఎలా ఉన్నా కోర్టు విధి విధానాలు మాత్రం అందరికీ ఒకేలా ఉండాలని సీజే వ్యాఖ్యానించారు.

విచారణ ఆలస్యం అయితే బందర్ పోర్టు నిర్మాణాన్ని మరో కంపెనీకి అప్పగించే అవకాశం ఉందని నవయుగ సంస్థ తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. అందుకు స్పందించిన ఏజీ.. ఇప్పటికిప్పుడు ఎవరికీ పోర్టు నిర్మాణాన్ని అప్పగించడం లేదని చెప్పారు.

గతంలో కొందరు న్యాయమూర్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నంటూ నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో జస్టిస్ డి. సోమయాజులు పేరును సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తావించారు.

First Published:  6 Sep 2022 3:21 AM GMT
Next Story