Telugu Global
Andhra Pradesh

కల్యాణ మస్తు కండిషన్స్ అప్ల‌య్‌.. ఇది మరో గోల..

బాలికల విద్యను ప్రోత్సహించేందుకే ఈ షరతు పెట్టామని ప్రభుత్వం చెబుతున్నా.. చదువుకోని వారికి పథకం వర్తించదు అనడం సరికాదని ప్రతిపక్షం వాదిస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత మేర తగ్గించేందుకే ఈ మెలిక పెట్టారని ఆరోపిస్తోంది.

కల్యాణ మస్తు కండిషన్స్ అప్ల‌య్‌.. ఇది మరో గోల..
X

ఏపీలో ఇటీవల కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దీనికోసం తయారు చేసిన నిబంధనలే ఇప్పుడు కాస్త విచిత్రంగా ఉన్నాయి. కల్యాణ మస్తు పథకం ద్వారా ఆర్థిక సాయం అందాలంటే కచ్చితంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు టెన్త్ క్లాస్ పాసవ్వాల్సిందే. టెన్త్ లోపు చదువుకున్నవారు పెళ్లి చేసుకుంటే ఈ ఆర్థిక సాయం అందదు. పథకం ప్రకటించిన మరుసటి రోజు ఈ నిబంధనలు చేర్చడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

వధూవరులిద్దరూ పదో తరగతి పాస్ అయితేనే వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం షరతు పెట్టింది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకే ఈ షరతు పెట్టామని ప్రభుత్వం చెబుతున్నా.. చదువుకోని వారికి పథకం వర్తించదు అనడం సరికాదని ప్రతిపక్షం వాదిస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను వీలైనంత మేర తగ్గించేందుకే ఈ మెలిక పెట్టారని ఆరోపిస్తోంది. ఈ పథకం విషయంలో నిబంధనలే హాట్ టాపిక్ గా మారాయి.

ఇతర పథకాల లాగే..

ఇతర సంక్షేమ పథకాల లాగే కల్యాణ మస్తు, షాదీ తోఫా పథకాల విషయంలో కూడా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇరు కుటంబాల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వార్షిక ఆదాయం అన్నీ లెక్కలోకి తీసుకుంటారు. ఆదాయం తక్కువగా ఉన్నా కూడా వధూవరులు టెన్త్ క్లాస్ పాసవ్వాలనే నిబంధన మాత్రం కాస్త ఇబ్బందిగా మారింది. ఈ పథకం కింద కనిష్టంగా బీసీలకు 40వేల రూపాయలు, గరిష్టంగా దివ్యాంగులకు లక్షా యాభైవేల రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తారు. ఆర్థిక సాయం ఎక్కువగానే ఉన్నా.. పది పాసైతేనే అనే నిబంధనతో నిరుపేద కుటుంబాలు ఈ పథకానికి దూరం అవుతాయని అంటున్నారు. ప్రతపక్షాలే కాదు, వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్న ఈ నిబంధనను ప్రభుత్వం సవరిస్తుందో లేదో చూడాలి.

First Published:  12 Sep 2022 3:07 AM GMT
Next Story