Telugu Global
Andhra Pradesh

పోసానికి కీలక పదవి కట్టబెట్టిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నటుడు పోసాని కృష్ణ మురళిని స్టేట్ ఫిల్మ్ అ‍ండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించింది. వైఎస్సార్ సీపీ ఏర్పడిన నాటి నుండి కృష్ణ మురళి ఆ పార్టీకి మద్దతుదారుగా నిలిచారు.

పోసానికి కీలక పదవి కట్టబెట్టిన ఏపీ సర్కార్
X

టాలీవుడ్ నటుడు, దర్శకుడు,రచయిత పోసాని కృష్ణ మురళికి జగన్ సర్కార్ కీలక పదవినిచ్చింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ అ‍ండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

టాలీవుడ్ లో రచయితగా ఎంటర్ అయిన కృష్ణమురళి, నటుడిగా అనేక మూవీలలో నటించారు. ఆయన రచయితగా కన్నా నటుడిగా ఎక్కువమందికి తెలుసు. పలు సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కృష్ణమురళి ఆ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు. సమయం వచ్చినప్పుడల్లా జగన్ కు మద్దతుగా మాట్లాడారాయన. ఎన్నికల్లో కూడా వైసీపీ తరపున కృష్ణ ముర‌ళి ఏపీలో ప్రచారం నిర్వహించారు.

కాగా ఏపీ స్టేట్ ఫిల్మ్ అ‍ండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా కృష్ణమురళిని నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇతర నియమ నిబంధనలు ప్రత్యేకంగా తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.


గత వారం హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. అలీ నియమకం జరిగిన రోజుల వ్యవధిలోనే పోసానికి కూడా కీలక పదవి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

First Published:  3 Nov 2022 9:52 AM GMT
Next Story