Telugu Global
Andhra Pradesh

రామోజీపై కోర్టులో పరువునష్టం దావా

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మీడియాలో వార్తల రూపంలో బురదచల్లేస్తున్న వైనాన్ని పొన్నవోలు ఆధారాలతో సహా పిటీషన్ వేశారు. ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థ‌లకు దురుద్దేశ్యాలను అంటకడుతు తనిష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్న రామోజీని అడ్డుకునేందుకే ప్రభుత్వం పరువునష్టం కేసు వేసినట్లు చెప్పారు.

రామోజీపై కోర్టులో పరువునష్టం దావా
X

మార్గదర్శి, ఈనాడు సంస్థ‌ల యాజమాన్యం రామోజీరావుపై రాష్ట్ర ప్రభుత్వం పరువునష్టం దావా వేసింది. గుంటూరు జిల్లా కోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి పిటీషన్ వేశారు. మార్గదర్శి మోసాలపై విచారణ చేస్తున్న సీఐడీ ఉన్నతాధికారులపైన, ప్రభుత్వంపైన తన మీడియాలో రామోజీ ఏ విధంగా పరువు తక్కువ వార్తలు రాస్తున్నారనే వివరాలను పొన్నవోలు తన పిటీషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. మార్గదర్శిపై విచారణను అడ్డుకోవటానికి, ప్రభావితం చేయటానికి వీలుగా తన మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ పదేపదే వార్తలు రాస్తున్నట్లు ఆరోపించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మీడియాలో వార్తల రూపంలో బురదచల్లేస్తున్న వైనాన్ని పొన్నవోలు ఆధారాలతో సహా పిటీషన్ వేశారు. ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థ‌లకు దురుద్దేశ్యాలను అంటకడుతు తనిష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్న రామోజీని అడ్డుకునేందుకే ప్రభుత్వం పరువునష్టం కేసు వేసినట్లు చెప్పారు. మీడియా ముసుగులో తాను ఏమిచేసినా చెల్లుబాటు అయిపోతుందని రామోజీ అనుకుంటున్నారని పొన్నవోలు అభిప్రాయపడ్డారు.

స్వార్థ, రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వంపై రామోజీ ప్రతిరోజు వార్తల రూపంలో బురదచల్లేస్తున్నట్లు పొన్నవోలు కొన్ని ఆధారాలను సమర్పించారు. దర్యాప్తు సంస్థ‌లను లక్ష్యంగా చేసుకుని రామోజీ తన మీడియాలో తప్పుడు కథనాలను రాసినట్లు చెప్పారు. చివరకు తన మీడియాలో న్యాయవ్యవస్థ‌ను భ్రష్టుపట్టించటానికి కూడా యాజమాన్యం వెనకడాటంలేదని మండిపోయారు. టీవీల్లో చర్చల పేరుతో న్యాయమూర్తులను లంచగొండులుగా రామోజీ చిత్రీకరించిన విషయాన్ని పొన్నవోలు పిటీషన్లో గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వాల మనుగడను కాపాడుకోవటం కోసమే రామోజీ మీద ప్రభుత్వం పరువునష్టం దావా వేసినట్లు పొన్నవోలు తన పిటీషన్లో చెప్పారు.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి తదుపరి చర్యల కోసం విచారణను వాయిదా వేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బుపట్టించేందుకు ఎల్లో మీడియా ఎంతగా ప్రయత్నిస్తోందో అంతేస్థాయిలో దాని యాజమాన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా అదే పద్ధ‌తిలో సిద్ధపడింది. మార్గదర్శి మోసాలపై విచారణ చేస్తున్న సీఐడీ ఇప్పుడు వ్యక్తిగతంగా రామోజీపై పరువునష్టం దావా వేయటం ఇందులో భాగమనే అనుకోవాలి. మరి పిటీషన్ విచారణపై కోర్టు ఏలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  5 July 2023 5:33 AM GMT
Next Story