Telugu Global
Andhra Pradesh

`క‌డియం` రైతుల‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం.. - అంత‌ర్జాతీయ ఎగుమ‌తుల పెంపుద‌లే ల‌క్ష్యం

ఇప్ప‌టికే క‌డియం నుంచి ఎగుమ‌తులు జ‌రుగుతున్న కువైట్‌, ఒమ‌న్, బెహ్ర‌యిన్‌, మాల్దీవులు, ఖ‌తార్‌, ట‌ర్కీ, అర‌బ్ దేశాల్లో మార్కెట్ అవ‌స‌రాల‌పై ఇక్క‌డి రైతుల‌కు అవ‌గాహ‌న లేదు.

`క‌డియం` రైతుల‌కు ప్ర‌భుత్వ ప్రోత్సాహం.. - అంత‌ర్జాతీయ ఎగుమ‌తుల పెంపుద‌లే ల‌క్ష్యం
X

క‌డియం న‌ర్స‌రీలు.. అంద‌మైన పూల మొక్క‌లు, అలంక‌ర‌ణ మొక్క‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రి స‌మీపంలో ఉన్న ఈ క‌డియం న‌ర్స‌రీల నుంచి దేశ విదేశాల‌కు ఏటా కోట్లాది రూపాయ‌ల విలువైన మొక్క‌లు ఎగుమ‌తి అవుతుంటాయి. ఇక్క‌డి రైతులు అంత‌ర్జాతీయంగా ఎగుమ‌తి అవ‌కాశాల‌ను మ‌రింత‌గా అందుకునేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ఏపీ ప్ర‌భుత్వం రూపొందించింది.

ప్ర‌స్తుతం క‌డియం నుంచి ఏటా ఏడు దేశాల‌కు రూ.5.50 కోట్ల విలువైన మొక్క‌లు ఎగుమ‌తి అవుతున్నాయి. వ‌చ్చే మూడేళ్ల‌లో ఈ మొత్తాన్ని రూ.7.40 కోట్ల‌కు పెంచాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా నిర్దేశించుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు మొక్క‌ల‌ను ఎగుమ‌తి చేస్తూ కోట్ల రూపాయ‌ల వ్యాపారం చేస్తున్న క‌డియం న‌ర్స‌రీల రైతులు అంత‌ర్జాతీయ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డుతున్నారు. స‌రైన అవగాహ‌న లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్ర‌భుత్వం వారికి ప్రోత్సాహం అందించేందుకు న‌డుం బిగించింది.

ఎగుమ‌తి అవ‌కాశాలు ఉన్న దేశాల‌కు మొక్క‌ల‌ను పంపేలా ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించింది. ఇందుకోసం స్వాట్ (స్ట్రెంగ్త్‌, వీక్‌నెస్‌, ఆప‌ర్చునిటీస్‌, త్రెట్‌) ఎనాల‌సిస్ చేసి దానిక‌నుగుణంగా ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్టు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ (ఎగుమ‌తులు) జీఎస్ రావు వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే క‌డియం నుంచి ఎగుమ‌తులు జ‌రుగుతున్న కువైట్‌, ఒమ‌న్, బెహ్ర‌యిన్‌, మాల్దీవులు, ఖ‌తార్‌, ట‌ర్కీ, అర‌బ్ దేశాల్లో మార్కెట్ అవ‌స‌రాల‌పై ఇక్క‌డి రైతుల‌కు అవ‌గాహ‌న లేదు. ఈ కార‌ణంగానే ఎగుమ‌తులకు అవ‌కాశాలున్నా.. వాటిని అందిపుచ్చుకోవ‌డంలో వారు వెనుక‌బ‌డుతున్నారు.

ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఎగుమ‌తులు జ‌రుగుతున్న దేశాల‌తో పాటు ఇత‌ర దేశాల్లోని మార్కెటింగ్ అవ‌కాశాల‌ను కూడా అందిపుచ్చుకోవాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించింది. దీంతో త‌క్కువ వ్య‌యంతో మొక్క‌ల‌ను ఉత్ప‌త్తి చేసే విధంగా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించుకునేలా రైతుల‌కు ప్రోత్సాహం అందించ‌నుంది. ఇందులో భాగంగా 2022-27 ఎగుమ‌తి ప్రోత్సాహ‌క విధానం కింద ప‌లు ప్రోత్సాహ‌కాల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

రాయితీలు ఇలా..

విదేశీ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొనే న‌ర్స‌రీ రైతుల‌కు 30 శాతం అద్దె రాయితీ, ఎగుమ‌తుల్లో కీల‌క‌మైన జెడ్ఈడీ స‌ర్టిఫికెట్ పొంద‌డంలో 10 శాతం రాయితీతో పాటు ఎగుమ‌తి నాణ్య‌త‌ను పొంద‌డానికి అవ‌స‌ర‌మైన ధ్రువ ప‌త్రాల‌ను పొంద‌డానికి అయ్యే వ్య‌యాల్లో 10 శాతం రాయితీల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. న‌ర్స‌రీ రైతుల‌కు నైపుణ్యం క‌ల్పించేందుకు స్కిల్ హ‌బ్స్‌లో ప్ర‌త్యేక కోర్సులు ప్ర‌వేశ‌పెట్టేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప్ర‌స్తుతం క‌డియం నుంచి 15 మంది రైతుల‌కు ఎగుమ‌తి లైసెన్సులు ఉన్నాయి. నాణ్య‌త‌, సర్టిఫికేష‌న్ వంటి అంశాల్లో వారికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు జిల్లా ఎక్స్‌పోర్ట్ హ‌బ్ ద్వారా శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

First Published:  17 Jan 2023 6:31 AM GMT
Next Story