Telugu Global
Andhra Pradesh

నా చిన్నతనంలోనే ఈ పరిస్థితి చూశా- హైకోర్టులో సీఎస్‌ జవహర్ రెడ్డి

జీతాల అంశాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. టీచర్లు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం ఎప్పుడైనా చూశారా అని సీఎస్‌ను ప్రశ్నించారు.

నా చిన్నతనంలోనే ఈ పరిస్థితి చూశా- హైకోర్టులో సీఎస్‌ జవహర్ రెడ్డి
X

ఏపీలో కొన్నిచోట్ల పాఠశాలల ఆవరణలో గ్రామ,వార్డు సచివాలయాల నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్బంగా జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పాఠశాలల ఆవరణలో గ్రామ, వార్డు సచివాలయాలను నిర్మించవద్దని 2020లోనే బట్టు దేవానంద్ ధర్మాసనం ఆదేశించింది. అయినా కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంగా జస్టిస్ బట్టు దేవానంద్.. కోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు నిర్మాణాలు కొనసాగించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డిని ప్రశ్నించారు.

కోర్టు ఆదేశాలను తాము స్వాగతిస్తున్నామని.. నిర్మించిన భవనాలను పాఠశాలలకే అప్పగిస్తున్నామని.. వాటిలో పాఠశాల అదనపు గదులు, లైబ్రరీలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చని సీఎస్ వివరించారు. ఈ విషయాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత ఆ భవనాలను కూల్చివేయాలా..? లేదా.. నిర్మాణం కోసం వెచ్చించిన 40 కోట్ల రూపాయలను బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేయాలా..? అన్న దానిపై ఆదేశాలు ఇస్తామన్నారు.

ఈ సందర్భంగా బట్టు దేవానంద్ ఇతర అంశాలను ప్రస్తావించారు. ఇటీవల తాను శ్రీకాకుళం జిల్లాలోని ఓ హాస్టల్‌ను సందర్శించానని.. 150 మందికి మూడు గదులు మాత్రమే ఉన్నాయన్నారు. 150 మంది విద్యార్థులకు సాక్షి పత్రికకు సంబంధించిన ఒక కాపీ మాత్రమే అందుబాటులో ఉంచారని.. మిగిలిన పత్రికలను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిగిలిన పత్రికలను కూడా అందుబాటులో ఉంచాలని కోరారు.

జీతాల అంశాన్ని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. టీచర్లు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం ఎప్పుడైనా చూశారా అని సీఎస్‌ను ప్రశ్నించారు. అందుకు సీఎస్‌ సమాధానం ఇస్తూ.. తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని.. తన చిన్నతనంలో మూడు నెలల జీతాల కోసం అప్పట్లో టీచర్లు ఆందోళన చేసిన ఉదంతం తనకు గుర్తుందన్నారు.

Next Story