Telugu Global
Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వ అప్పు శాతమే అధికం- ఏపీ ప్రభుత్వం

టీడీపీ హయాంలోనే లక్షా 11వేల కోట్లకు లెక్కలు లేవని కేంద్రమంత్రే స్వయంగా పార్లమెంట్‌లో చెప్పారని .. ఆ విషయం మాత్రం టీడీపీ మీడియాలో ఎక్కడా కనిపించలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వ అప్పు శాతమే అధికం- ఏపీ ప్రభుత్వం
X

ఏపీ భారీ అప్పులు కూరుకుపోయిందంటూ ఈనాడు పత్రిక రాసిన కథనంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్ ఇచ్చారు.

దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ జగన్‌కు వస్తున్న పేరు చూసి ఓర్వలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. టీడీపీకి ప్రజలు అవకాశం ఇచ్చినా 2014-19 మధ్య దాన్ని వృథా చేసుకుని చరిత్రహీనుడిగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. టీడీపీ హయాంలోనే లక్షా 11వేల కోట్లకు లెక్కలు లేవని కేంద్రమంత్రే స్వయంగా పార్లమెంట్‌లో చెప్పారని .. ఆ విషయం మాత్రం టీడీపీ మీడియాలో ఎక్కడా కనిపించలేదన్నారు.

ఎన్టీఆర్‌ను పవర్‌లోకి తెచ్చిందే తానన్న అహంకారం రామోజీరావులో ఉందన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు సమయంలోనూ రామోజీరావు తన సత్తా చూపించారన్నారు. జగన్‌ను దెబ్బతీయాలంటే ఈ ప్రభుత్వం బాధ్యతరాహిత్యంగా ఉందన్న భావన కలిగించాలన్న ఉద్దేశంతోనే ఈనాడు రోజూ అప్పుల గురించి రాస్తోందన్నారు. చంద్రబాబే పెద్ద తుపానని.. ఆయన ఇప్పుడు పర్యటనకు వెళ్లి.. తానే సీఎంగా ఉంటే తుపాను కంటే ముందే వచ్చేవాడినని మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు.

వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లినట్టు కాకుండా సంబరాలు చేసుకునేందుకు వెళ్లినట్టుగా చంద్రబాబు టూర్ ఉందన్నారు. వరద బాధితుల పరామర్శకు వెళ్లి ప్లవర్ బొకేలు తీసుకోవడం, శాలువాలు కప్పించుకోవడం ఏమిటని సజ్జల ఎద్దేవా చేశారు. ప్రజల్లో టీడీపీ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. చంద్రబాబు ఉంటేనే తమ దోపిడికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే మీడియా సంస్థలు టీడీపీని మోస్తున్నాయని సజ్జల ఆరోపించారు.

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే దశ దాటిపోయి.. వ్యవస్థలను నడిపే స్థాయికి వెళ్లారన్నారు. చంద్రబాబు శరీరానికి సంక్షేమం అనేది ఒక విషం లాంటిందని.. అందుకే జగన్‌ సంక్షేమం అమలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని స్థంభింప చేసే కుట్రలో భాగంగానే నిధులు రాకుండా అడ్డుకునేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల విమర్శించారు.

కేంద్ర అప్పుతో పోల్చి చూడండి- దువ్వూరి కృష్ణ

ఏపీ పరిస్థితిని శ్రీలంకతో పోల్చడం సరికాదన్నారు సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. దేశానికి, రాష్ట్రాలకు పరిస్థితులు వేరుగా ఉంటాయన్నారు. టాక్స్‌లు తగ్గించడం, మొత్తం సేంద్రీయ వ్యవసాయానికి ఒక్కసారిగా మళ్లడంతో ఉత్పత్తి పడిపోయి ఆహార కొరత ఏర్పడడం, అత్యధికంగా దిగుమతులపై ఆధారపడడం, ధరలు అమాంతం పెరిగిపోవడం, జీడీపీ పడిపోవడం, బయట దేశాల అప్పు భారీగా పెరిగిపోవడం , వెంటనే చెల్లించాల్సిన రుణాలు భారీగా ఉండడంతో శ్రీలంక సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండదన్నారు.

శ్రీలంక పరిస్థితులను చూసిన తర్వాత మన దేశంలో కేంద్రం గానీ, రాష్ట్రాలు గానీ అప్పులు తగ్గించాలన్న ఆలోచనకు తాము వ్యతిరేకం కాదన్నారు. కాకపోతే కోవిడ్ కారణంగానే అప్పులు భారీగా చేయాల్సి వచ్చిందన్నారు. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే గతేడాది అతి తక్కువ అప్పు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి అప్పులు తెచ్చారని దువ్వూరి కృష్ణ గణాంకాలు వివరించారు. ఏపీలో ద్రవ్యలోటు ప్రస్తుతం అతి తక్కువగా ఉందన్నారు.

చంద్రబాబు హయాంలో ఏటా 19.4 శాతం అప్పులు తెచ్చారని.. అదే ప్రస్తుత ప్రభుత్వంలో అప్పుల శాతం ఏటా 15. 77 శాతమే ఉందన్నారు.ఒక్క ఏపీలో కాదని.. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా భారీగా అప్పులు చేసిందన్నారు. 2019 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు.. 90 లక్షల 83వేల కోట్లుగా ఉండేదన్నారు. అది మూడేళ్లలో 135 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. అప్పులు దాచడం అయ్యే పని కాదని.. ప్రతి అప్పు వివరాలను కాగ్‌కు సమర్పిస్తున్నామన్నారు. అప్పులను ఎక్కువ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీని వల్ల రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలుగుతోందని దువ్వూరి కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

First Published:  21 July 2022 12:12 PM GMT
Next Story