Telugu Global
Andhra Pradesh

వికృత విన్యాసానికి నరబలి

ఘటన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ముఖంలో పశ్చాత్తాపమే కనిపించలేదన్నారు. దుర్ఘటనను కూడా రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు.

వికృత విన్యాసానికి నరబలి
X

కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కారణంగానే కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఉద్దేశపూర్వకంగా రోడ్డును ఇరుకుగా ఎలా మార్చారు అన్నదానికి సంబంధించిన వీడియోను మీడియా సమావేశంలో సజ్జల విడుదల చేశారు. జనం కిక్కిరిసిపోయారన్న భావన కలిగించేందుకు వీలుగా.. 30 అడుగుల రోడ్డు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని.. రోడ్లుకు ఇరువైపులా ఫ్లెక్సీలు కట్టి 20 అడుగులు మాత్రమే ఖాళీ స్థలం మిగిలేలా చేశారన్నారు.

ఆ తర్వాత చంద్రబాబు తన వెంట తెచ్చుకున్న జనంతో ముందుకు చొచ్చుకెళ్లారని దాంతో తొక్కిసలాట జరిగిందన్నారు. కేవలం కందుకూరు జనసంద్రం అయిందని ప్రచారం చేసుకునేందుకు వీలుగానే ఈ పని చేశారన్నారు. పైగా పోలీసులపైకి నిందలేయాలని చూస్తున్నారని విమర్శించారు. పోలీసులు చెప్పిన ప్రాంతంలో చంద్రబాబు మీటింగ్‌ పెట్టేందుకు, పోలీసుల సూచనలు పాటించేందుకు ఎక్కడ సిద్ధపడ్డారని ప్రశ్నించారు.

ఘటన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు ముఖంలో పశ్చాత్తాపమే కనిపించలేదన్నారు. దుర్ఘటనను కూడా రాజకీయంగా అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు వికృత విన్యాసం కారణంగానే నరబలి జరిగిందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు పుష్కరాల్లోనూ చంద్రబాబు వల్ల తొక్కిసలాట జరిగి 32 మంది చనిపోతే అప్పుడు కూడా అహంకారపూరితంగానే మాట్లాడారని సజ్జల గుర్తుచేశారు. ప్ర‌జ‌ల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదన్నారు.

First Published:  29 Dec 2022 2:00 PM GMT
Next Story