Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుపై మళ్లీ విరుచుకుపడ్డ కొడాలి

పాదయాత్రలు చేసినా, చందాలు వసూలు చేసుకున్నా మూడు రాజధానులు మాత్రం ఆగే ప్రసక్తే లేదన్నారు కొడాలి నాని. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు

చంద్రబాబుపై మళ్లీ విరుచుకుపడ్డ కొడాలి
X

హైదరాబాద్‌ను తాను నిర్మించడం ప్రారంభిస్తే ఆ తర్వాత వైఎస్ కొనసాగించారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని.. ఆ మాటలు వింటుంటే చంద్రబాబుకు మైండ్ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. వినేవాళ్లు త‌నను పిచ్చోడు అనుకుంటున్నారన్న ఆలోచన కూడా చంద్రబాబు లేకుండాపోయిందన్నారు.

తనను చూసే ఒకే ఒక్కడు సినిమా తీశారని చెప్పుకునే పిచ్చోడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా జగన్‌ కూడా మూడు నెలలకోసారి అమరావతికి కొత్త గ్రాఫిక్స్ విడుదల చేస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. బెంగళూరు, హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నైను దాటి అమరావతిని తీర్చేదిద్దేవాడిని అని చంద్ర‌బాబు చెప్పుకుంటున్నాడ‌ని, ఇది పిచ్చి కాక మరేంటన్నారు.

బొంబాయి గ్రాఫిక్స్ విడుదల చేస్తూ అమరావతి రైతులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ ఎండగట్టి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి మొత్తం తెచ్చి అమరావతిలో పెడితే ఎంతమంది బాగుపడుతారని ప్రశ్నించారు. ఇలాంటి నిర్మాణాల కోసమే చైనా నుంచి వేల కోట్ల అప్పు తేవడం వల్లనే శ్రీలంక దివాలా తీసిందన్నారు.

ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం రోడ్లు కూడా వేయని వ్యక్తి ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నారని కొడాలి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో 72 అసెంబ్లీ స్థానాలు, ముంబాయిలో 39 అసెంబ్లీ స్థానాలు, కోల్‌కతాలో 25కుపైనా స్థానాలున్నాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌కు 24 మంది ఎమ్మెల్యేలు, చెన్నై నగరంలో 29 మంది ఎమ్మెల్యేలున్నారని, అమరావతికి ఒక మండలంలోని 29 గ్రామాలున్నాయని.. అలాంటి అమరావతిని ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌, చెన్నైతో పోల్చి కథలు చెబుతున్నారంటే చంద్రబాబును ఏమనాలి ?, అతడి మాటలు నమ్ముతున్న అమరావతివాదులను ఏమనాలని కొడాలి ప్రశ్నించారు.

10వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రానికే సంపద అందించే విశాఖను రాజధానిని చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం బొంబాయి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి 420లు ఎంత మంది అడ్డుపడ్డా విశాఖను పరిపాలన రాజధాని చేసి చూపిస్తామన్నారు. మూడు రాజధానుల బిల్లులు వెనక్కు తీసుకున్న ఈ పరిస్థితుల్లో విశాఖ రాజధాని వద్దంటూ విశాఖ వైపు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. అల్లర్లు సృష్టించి చలి కాచుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కొడాలి విమర్శించారు.

పాదయాత్రలు చేసినా, చందాలు వసూలు చేసుకున్నా మూడు రాజధానులు మాత్రం ఆగే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ముద్రగడ పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన కోర్టుకు వెళ్లినా అనుమతి రాలేదన్నారు. ఇప్పుడు మాత్రం కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చేసుకుంటున్నారని కొడాలి విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాదయాత్రకు ఆయన అనుమతి ఇవ్వరు, కోర్టులు అనుమతి ఇవ్వవని.. అదే జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ వైపు పాదయాత్ర చేస్తే గొడవలు జరుగుతాయని పోలీసులు చెప్పినా కోర్టులు అనుమతులు ఇచ్చేస్తున్నాయని కొడాలి ఆవేదన చెందారు. చంద్రబాబు దగ్గర ఉన్నరహస్యం ఏంటో అంతు చిక్కడం లేదన్నారు.

First Published:  9 Sep 2022 2:52 PM GMT
Next Story