Telugu Global
Andhra Pradesh

ముగిసిన చర్చలు.. ఉద్యమానికే ఉద్యోగ సంఘాలు..

సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నించగా సీఎస్ స్పందించడానికి నిరాకరించారు. సీపీఎస్ రద్దు వ్యవహారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పరిధిలో ఉందని, దానిపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు.

ముగిసిన చర్చలు.. ఉద్యమానికే ఉద్యోగ సంఘాలు..
X

ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు, మరోవైపు ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నాయి. తాజాగా ఉద్యోగుల హెల్త్ కార్డ్ లు, పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ రద్దు విషయాలపై చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. అయితే యథావిధిగా ఎలాంటి బలమైన హామీలు లేకుండా చర్చలు ముగిశాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమం కొనసాగింపుకే మొగ్గుచూపాయి. ఏప్రిల్-5న మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఏపీజేఏసీ అమరావతి నేతలు.

ఉద్యోగుల హెల్త్ కార్డ్ ల కోసం వారి జీతంలోనుంచి నెల నెలా కొంతమొత్తం కట్ చేస్తున్నారు. అయితే అవసరానికి ఆ కార్డులు పనికి రావడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కావాలంటున్నారు. దీనిపై స్పందించిన సీఎస్.. ఇప్పటికే ఉన్న కార్డ్ లను అప్ డేట్ చేస్తామని, నెట్ వర్క్ ఆస్పత్రులతో మాట్లాడి ప్యాకేజీ మారుస్తామని తెలిపారు.

సీపీఎస్ మా పరిధిలో లేదు..

సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నించగా సీఎస్ స్పందించడానికి నిరాకరించారు. సీపీఎస్ రద్దు వ్యవహారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పరిధిలో ఉందని, దానిపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. 11వ పీఆర్సీ సూచించిన పేస్కేల్ కాకుండా కరస్పాండెన్స్ పేస్కేళ్లతో జీవో ఇవ్వడం వల్ల ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్లు తగ్గిపోయిన అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగ సంఘాల నేతలు. వాటిని సవరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. పాత డీఏ బకాయిలు, ఏపీ జీఎల్ఐ బకాయిల విషయంలో కూడా స్పష్టమైన హామీ రాలేదని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ అరియర్స్ ఇంకా లెక్క కట్టలేదని చెప్పారు అధికారులు.

సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన ఉన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో జరిగిన ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను చర్చలకు పిలవకపోవడంతో ఆయా సంఘాల నాయకులు అలకబూనారు.

First Published:  25 March 2023 12:57 AM GMT
Next Story