Telugu Global
Andhra Pradesh

మీకు జీతాలు దండగ. నేనే యూట్యూబ్‌లో పాఠాలు చెబుతా..

కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం వేస్ట్‌.. నేను యూట్యూబ్‌లో పాఠాలు చెబుతా.. ప్రభుత్యానికి కోట్ల రూపాయలు మిగిలిపోతాయి అంటూ ప్రవీణ్ ప్రకాశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మీకు జీతాలు దండగ. నేనే యూట్యూబ్‌లో పాఠాలు చెబుతా..
X

ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. తన పర్యటనల్లో అనేక లోపాలను ఆయన బయటపెడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీచర్లపై సస్పెన్షన్‌ వేటు కూడా వేస్తున్నారు. ప‌శ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన ప్రవీణ్ ప్రకాశ్‌.. అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి వచ్చినా ఇంకా రికార్డుల్లో ఆగస్ట్‌ వరకే బోధన చేసినట్టు రాసి ఉండటంపై ఫైర్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా టీచర్ల తీరును తప్పుపట్టారు. మొదటి పీరియడ్ అయిపోగానే టీచర్లు నిద్రపోతుంటారని విమర్శించారు. కొందరు క్రికెట్ చూస్తూ టైం పాస్‌ చేస్తున్నారని.. ఇక్కడ బోధన ఇలా ఉండటం వల్లనే ప్రైవేట్‌ స్కూళ్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.

అక్కడే ఉన్న డీఈవో, డీవైఈవో, ఎంఈవోలను మీ జీతమెంత అని ప్రవీణ్ ప్రకాశ్ ప్రశ్నించారు. వారు తన జీతాల గురించి చెప్పగా.. కోట్లు తీసుకుంటున్నారని, కానీ ఏం ఉపయోగం అని వ్యాఖ్యానించారు. ఈ మాత్రం దానికి మీ అందరికి కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం వేస్ట్‌.. నేను యూట్యూబ్‌లో పాఠాలు చెబుతా.. ప్రభుత్యానికి కోట్ల రూపాయలు మిగిలిపోతాయి అంటూ ప్రవీణ్ ప్రకాశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆగస్టులోనే నిధులు మంజూరైనా ఇంకా నాడు-నేడు కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోయారని.. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదని ప్రశ్నించారు.

ఇక్కడ ఒకటి గమనించాలి. తల్లిదండ్రులు అప్పులు చేసైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారంటే కారణం... ప్రభుత్వం స్కూళ్లలో మౌలిక సదుపాయాలు బాగోలేవని కాదు. అక్కడ బాధ్యతాయుతంగా విద్యాబోధన చేసే వారు లేరన్న కారణంతోనే ప్రైవేట్ వైపు అడుగేస్తున్నారు. ఆ లోపాన్ని సరిదిద్దనంత కాలం భవనాలను ఎంత బాగు చేసినా ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు పొందడం కష్టమే.

First Published:  29 Jan 2023 3:50 AM GMT
Next Story