Telugu Global
Andhra Pradesh

టెట్ తో సరిపెట్టుకోండి.. ఎన్నికలలోపు ఏపీలో డీఎస్సీ లేనట్టే

తాజాగా నిర్వహించే టెట్ పరీక్షకు దాదాపు 5 లక్షలమంది హాజరవుతారని అంచనా. టెట్‌ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని అంటున్నారు.

టెట్ తో సరిపెట్టుకోండి.. ఎన్నికలలోపు ఏపీలో డీఎస్సీ లేనట్టే
X

ఏపీలో డీఎస్సీ పరీక్ష బ్రహ్మపదార్థంలా తయారైంది. అదిగో ఇదిగో అంటున్నారే కానీ అసలు నోటిఫికేషన్ మాత్రం రాలేదు, ఎన్నికల వేళ వస్తుందనే ఆశ ఉన్నా.. టెట్ నోటిఫికేషన్ వేస్తామనే ప్రకటనతో అది ఆవిరైంది. నిరుద్యోగులకు శుభవార్త - రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అంటూ సాక్షి గొప్పగా చెప్పుకుంది కానీ, టెట్ నోటిఫికేషన్ అంటేనే అసలు డీఎస్సీ ఇప్పుడల్లా లేదు అని అర్థం. టెట్ నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, రిజల్ట్ లో క్వాలిఫై అయిన వారికోసం డీఎస్సీ నిర్వహిస్తారు. ఇదీ పద్ధతి. పోనీ టెట్ తోపాటు డీఎస్సీ అని ప్రకటన వచ్చినా కూడా కొద్దోగొప్పో ఆశలు ఉండేవి. కానీ విడిగా టెట్ నోటిఫికేషన్ అనేసరికి ఏపీ నిరుద్యోగులకు ఇది శుభవార్త కానే కాదనే విషయం తేలిపోయింది.

టెట్ నిర్వహణకు ఏపీ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్‌ నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నా.. టెట్ వల్ల డీఎస్సీ ఆలస్యం అవుతుందనే విషయాన్ని మాత్రం వారు దాటవేస్తున్నారు. తాజాగా నిర్వహించే టెట్ పరీక్షకు దాదాపు 5 లక్షలమంది హాజరవుతారని అంచనా. టెట్‌ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని అంటున్నారు.

గతంలో టీచర్ పోస్ట్ లకు కేవలం డీఎస్సీ మాత్రమే నిర్వహించేవారు. ఆ తర్వాత కేంద్రం మార్గదర్శకాలంటూ టెట్ ని తప్పనిసరి చేశారు. టెట్ లో క్వాలిఫై అయినవారు మాత్రమే డీఎస్సీ రాసేందుకు అర్హులు. అంటే.. బీఈడీ, డీఈడీ పూర్తి చేసినా టీచర్ పోస్ట్ లు రావాలంటే మరో రెండు పరీక్షలు గట్టెక్కాలి. అంటే ప్రభుత్వాల వద్ద వీలైనంత ఎక్కువ సమయం ఉంటుంది. డీఎస్సీకోసం ఒత్తిడి పెరిగే టైమ్ లో టెట్ పేరుతో సర్దిచెప్పే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కూడా అలాగే సేఫ్ గేమ్ ఆడుతోంది. ప్రభుత్వం టెట్ కి సిద్ధమైంది అంటే.. కచ్చితంగా డీఎస్సీ లేటవుతున్నట్టే లెక్క.

First Published:  28 Jan 2024 3:26 AM GMT
Next Story