Telugu Global
Andhra Pradesh

వ్యవస్థలపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోం - ఏపీ డీజీపీ

సీఎం ఇల్లు, సీఎం క్యాంప్ ఆఫీస్.. కూడా చట్టబద్ధ వ్యవస్థలు అని, అలాంటి వ్యవస్థలపై దాడికి పిలుపునివ్వడం, ముట్టడి చేస్తామనడం చట్టవ్యతిరేకం అన్నారు డీజీపీ. దాడులు జరగకుండా ఆపడం తమ విధి అని, దాడులకు పిలుపునిచ్చినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వ్యవస్థలపై దాడి చేస్తామంటే చూస్తూ ఊరుకోం - ఏపీ డీజీపీ
X

వ్యవస్థలపై దాడికి పిలుపు ఇవ్వడం సరికాదని, వారు ఉద్యోగులైనా, ఇంకెవరైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏపీ డీజీపీ క‌సిరెడ్డి వెంక‌ట రాజేంద్రనాథ్ రెడ్డి. ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిక్టేట్ చేయలేరు అని చెప్పారాయన. సెప్టెంబర్-1న విజయవాడలో మిలియన్ మార్చ్ తోపాటు, సీఎం ఇంటి ముట్టడికి ఇటీవల ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన విషయం, ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు పోలీసులు '41-నోటీస్' లు ఇచ్చారు. కొంతమందిని జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నారు. వారికి ఇచ్చిన నోటీసులు భవిష్యత్తులో పోలీసులకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటాయన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.

సీఎం ఇల్లు, సీఎం క్యాంప్ ఆఫీస్.. కూడా చట్టబద్ధ వ్యవస్థలు అని, అలాంటి వ్యవస్థలపై దాడికి పిలుపునివ్వడం, ముట్టడి చేస్తామనడం చట్టవ్యతిరేకం అన్నారు డీజీపీ. దాడులు జరగకుండా ఆపడం తమ విధి అని, దాడులకు పిలుపునిచ్చినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాలు తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. సెప్టెంబర్ 11న ఉద్యోగ సంఘాలు సీఎం ఇంటి ముట్టడి అనే పదం లేకుండా శాంతియుత ప్రదర్శన అంటూ కార్యక్రమాన్ని మార్చుకున్నాయి. దీంతో పోలీసులు కూడా ప్రస్తుతానికి నోటీసుల విషయంలో ముందుకెళ్లడంలేదు.

చవితి మండపాలపై అనవసర రాద్ధాంతం..

గణేష్ ఉత్సవ కమిటీ వాళ్లకు గతంలో ఉన్న నిబంధనల్నే మళ్లీ చెప్పామని, కానీ ఈ ఏడాదే కొత్తగా నిబంధనలు తెచ్చినట్టు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు డీజీపీ. ఫైర్ డిపార్ట్ మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్, పోలీసు శాఖ నుంచి అనుమతులు గతంలో లాగే తీసుకోవాలన్నామని, నిమజ్జన వేళ కూడా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు డీజీపీ. రాజకీయ పార్టీలు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారాయన. నిమజ్జనం ప్రశాంతంగా జరగాలనే తాము కోరుకుంటామని, రాజకీయ నాయకులు ప్రకటనలతో ప్రజల్లో ఆందోళనలు పెంచొద్దని సూచించారు.

First Published:  30 Aug 2022 10:20 AM GMT
Next Story