Telugu Global
Andhra Pradesh

మెగాస్టార్ మావాడే..! కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?

చిరంజీవి మావాడేనంటూ ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు చెప్పడం మాత్రం విశేషం. దీంతో ఆయన కామెంట్లు టాక్ ఆఫ్ ఏపీగా మారాయి. అంతేకాదు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా సెలవిచ్చారు రుద్రరాజు.

Andhra Pradesh Congress interesting comments on megastar Chiranjeevi
X

మెగాస్టార్ మావాడే..! కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?

నేను రాజకీయాల్లో లేను బాబోయ్ అంటూ చిరంజీవి ఎంత మొత్తుకుంటున్నా.. ఆయన్ను రాజకీయాలు వదిలి వెళ్లేలా లేవు. అప్పుడప్పుడు సినిమాలకోసం ఆయన చెబుతున్న పంచ్ డైలాగుల్లాగా ఆయన రాజకీయ పాత్ర కూడా ఇంకా సజీవంగానే ఉన్నట్టు అనుకోవాల్సిందే. తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, చిరంజీవి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు.

చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పారు గిడుగు రుద్రరాజు. వాస్తవానికి ఏపీసీసీ అధ్యక్షుడి స్టేట్ మెంట్ అంటే ఎవరూ పట్టించుకోరు. అసలా పోస్ట్ లో ఉన్నది ఎవరని కూడా ఆసక్తి చూపించరు. అందుకే ఆయన ఉద్దేశపూర్వకంగా చిరంజీవి పేరెత్తారా, లేక హైకమాండ్ నుంచి ఆమేరకు హింట్ ఉందో తెలియదు కానీ.. చిరంజీవి మావాడేనంటూ ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు చెప్పడం మాత్రం విశేషం. దీంతో ఆయన కామెంట్లు టాక్ ఆఫ్ ఏపీగా మారాయి. అంతేకాదు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయని కూడా సెలవిచ్చారు రుద్రరాజు.

అప్పట్లో ఐడీ కార్డ్..

ఆమధ్య గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి చిరంజీవి డైలాగ్ ఒకటి వైరల్ గా మారింది. రాజకీయం తన నుంచి దూరం కాలేదనే డైలాగ్ ని చిరంజీవి ట్వీట్ చేయడంతో అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత అది సినిమాలో డైలాగ్ అని తేలడం, ఆ వెంటనే చిరంజీవి కాంగ్రెస్ పార్టీ ఐడీకార్డ్ బయటకు రావడం కూడా ఆసక్తిగా మారింది. చిరంజీవిని తమ ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కాంగ్రెస్ జారీ చేసింది.

ఆ తర్వాత మళ్లీ వాల్తేరు వీరయ్య సమయంలో చిరంజీవి ఇంటర్వ్యూలు పొలిటికల్ గా వైరల్ అయ్యాయి. జగన్ కి కానీ, జనసేనకు కానీ తాను దగ్గర కాదని, దూరం కాదని తేల్చి చెప్పారు చిరంజీవి. దీంతో ఆయన రాజకీయాలకే దూరం అనుకున్నారు. ఈ దశలో మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చిరంజీవి మావాడేననడం విశేషం.

First Published:  20 Jan 2023 4:52 AM GMT
Next Story