Telugu Global
Andhra Pradesh

అందరూ తిట్టారుగా.. అప్పలరాజుకే ఎందుకిలా..?

అందరూ తిట్టారు కానీ.. అందులో మంత్రి అప్పలరాజు కాస్త లైన్ దాటారు. ఆంధ్రా ప్రజలు తెలంగాణ వెళ్లడం మానేస్తే.. అక్కడి వాళ్లు అడుక్కు తినాల్సిందేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అందరూ తిట్టారుగా.. అప్పలరాజుకే ఎందుకిలా..?
X

హరీష్, హరీష్, హరీష్.. మూడు రోజులుగా ఏపీలోని వైసీపీ నాయకులు మూకుమ్మడిగా తలచుకున్న పేరు ఇదే. ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఆస్పత్రి సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. మీరు చూస్తున్నారు కదా అంటూ హరీష్ రావు భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి వేసిన ప్రశ్నలకు వైసీపీ నేతలు భుజాలు తడుముకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్ల దండకం అందుకున్నారు.

మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో మొదలు పెడితే.. సీదిరి అప్పలరాజు, బొత్స సత్యానారాయణ, మాజీ మంత్రి పేర్ని నాని.. ఇలా చాలామంది స్పందించారు. బీఆర్ఎస్ పై అక్కసు వెళ్లగక్కారు. అయితే వీరిలో మంత్రి సీదిరి అప్పలరాజుకే కాస్త ఇబ్బంది ఎదురైనట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆయనకు క్లాస్ తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

అప్పలరాజుకే ఎందుకిలా..?

అందరూ తిట్టారు కానీ.. అందులో మంత్రి అప్పలరాజు కాస్త లైన్ దాటారు. కేసీఆర్ ఫ్యామిలీని కూడా ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చారు. ఆంధ్రా ప్రజలు తెలంగాణ వెళ్లడం మానేస్తే.. అక్కడి వాళ్లు అడుక్కుతినాల్సిందేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చంద్రబాబుని ఎంత తిడితే జగన్ కి అంత ఇష్టం అనే ఫార్ములాని అందరూ వంటబట్టించుకున్నారు.

ఆ విషయంలో మాజీ మంత్రి కొడాలి నానితో వైసీపీ నేతలంతా పోటీ పడ్డారు, పడుతున్నారు కూడా. అదే ఫార్ములాని అప్పలరాజు కేసీఆర్ విషయంలో కూడా ఉపయోగించారు. అయితే ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై అందులోనూ అసందర్భంగా నిందలు వేసే సరికి సీఎంఓ స్పందించాల్సి వచ్చిందని అంటున్నారు.

సోషల్ మీడియాలో అప్పలరాజు వీడియో వైరల్ గా మారడంతో సీఎంఓ స్పందించిందని చెబుతున్నారు. విమర్శల సమయంలో పరుష పదజాలం వద్దని, అవతలి వారి స్థాయి, మనం మాట్లాడే భాషను దృష్టిలో ఉంచుకోవాలని సీఎంఓ వర్గాలు సుద్దులు చెప్పినట్టు వార్తలొచ్చాయి.

నిజంగానే సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసిందా, అప్పలరాజుకి ఆ స్థాయిలో క్లాస్ తీసుకుందా అనే విషయంపై అధికారిక స్పందన లేదు. అందరూ తిడితే అప్పలరాజుని మాత్రమే స్పెషల్ గా మందలించడం విశేషం. దీనిపై అప్పలరాజు క్లారిటీ ఇస్తారో, లేక వైసీపీ అధికారిక మీడియా కన్ఫామ్ చేస్తుందో వేచి చూడాలి.

First Published:  14 April 2023 12:36 AM GMT
Next Story