Telugu Global
Andhra Pradesh

ఏపీలో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు.. ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

ఏనాడూ లేని రీతిలో పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొని వచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పారు. స్టేషన్లలో రిసెప్షనిస్టులను పెట్టి ప్రజలకు సరైన సమాచారం, తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

ఏపీలో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు.. ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
X

ఏపీలో ప్రజల భద్రతకు పెద్ద పీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్.. మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు, యాప్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ ప్రయోగం విజయవంతం కావడంతో తాజాగా టూరిస్టుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్టేషన్లను ప్రారంభించారు. తొలి విడతగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. పోలీస్ శాఖ అద్భుతంగా పని చేస్తోందని.. వారి ఆధ్వర్యంలో మరో మంచి కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమని సీఎం జగన్ అన్నారు. పోలీసు వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని, ప్రజలకు దగ్గరగా ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం అన్నారు.

గతంలో ఏనాడూ లేని రీతిలో పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొని వచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని చెప్పారు. స్టేషన్లలో రిసెప్షనిస్టులను పెట్టి ప్రజలకు సరైన సమాచారం, తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీస్ బూత్‌ను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు. పోలీస్ బూత్‌కు అనుసంధానంగా 10 టూవీలర్స్, రెండు పట్రోలింగ్ వాహనాలు కూడా ఉండబోతున్నాయి. కొత్తగా తీసుకున్న ఆ వాహనాలను హోం మంత్రి తానేటి వనిత, ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు.

ఏపీలోని విశాఖపట్నం ఆర్కే బీచ్ సహా.. వైఎస్ఆర్ కడప జిల్లా గండికోట, కాకినాడ జిల్లా పిఠాపురం కుక్కుటేశ్వరాలయం, రాజమండ్రి పుష్కర ఘాట్, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయం, కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్, విజయవాడ ఇంద్రకీలాద్రి, ఒంటిమిట్ట రామాలయం, రాజమండ్రి గోదావరి ఘాట్, కాకినాడ బీచ్, మోపీదేవి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలోని భవానీ ఐలాండ్, ఇంద్రకీలాద్రి, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం, నెల్లూరు జిల్లా మైపాడు బీచ్, పెంచలకొండ ఆలయం, కర్నూలు జిల్లా మంత్రాయలం, నంద్యాల జిల్లా మహానంది, అన్నమయ్య జిల్లా హార్స్‌లీ హిల్స్, సత్యసాయి జిల్లా లేపాక్షి వద్ద టూరిస్ట్ స్టేషన్లను ప్రారంభించారు.

First Published:  14 Feb 2023 9:00 AM GMT
Next Story