Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలను భయపెడుతున్న జగన్ 'ప్రజాదర్బార్'

ప్రజాదర్బార్ అనే సరికి రాష్ట్ర నలుమూలల నుంచి తప్పకుండా వేలాది మంది వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రికి చెప్పుకుంటే తమ సమస్య పరిష్కారం అవుతుందని భావించే వాళ్లు చాలా మంది ఉంటారు.

ప్రతిపక్షాలను భయపెడుతున్న జగన్ ప్రజాదర్బార్
X

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి త్వరలో 'ప్రజా దర్బార్' పేరుతో నిర్వహించనున్న కార్యక్రమం ఇప్పుడు ప్రతిపక్షాల్లో కాక పుట్టిస్తుంది. ఈ కార్యక్రమాన్ని జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజా దర్బార్ వల్ల పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. తప్పకుండా ఇది పార్టీకి కలసి వచ్చే కార్యక్రమమే అని జగన్ ధీమాగా ఉన్నారు. అదే సమయంలో సీఎం స్వయంగా ప్రజలను కలవడం అనే కాన్సెప్ట్ ప్రతిపక్షాల్లో భయం పుట్టిస్తోంది. ఇన్నాళ్లూ ప్రజల గోడును పట్టించుకోకుండా.. కేవలం బటన్ మాత్రమే నొక్కుతున్నాడంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఈ కార్యక్రమం ద్వారా జగన్ చెక్ పెట్టబోతున్నారు.

ఏపీలో రెండేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల జరుగనున్నాయి. కానీ సీఎం జగన్ మాత్రం ఇప్పటి నుంచే తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. 'గడప గడపకు మన ప్రభుత్వం' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ప్రజలు తీవ్రంగా నిలదీశారు. ఆ సమయంలో ఎక్కువ మంది తమ సొంత సమస్యలనే చెప్పుకున్నారు. కానీ ప్రభుత్వంపై మాత్రం ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని సీఎం జగన్‌ ముందే అంచనా వేసుకున్నారు. అయితే ఆ కార్యక్రమం ద్వారా ఒక అంచనాకు వచ్చిన సీఎం జగన్ 'ప్రజా దర్బార్'కు తెరలేపారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రజల సమస్యలను స్వయంగా విని, వాటిని పరిష్కరిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ముందుగా 'రచ్చబండ' పేరుతో ప్రజల వద్దకే వెళ్లే కార్యక్రమం చేపట్టాలని జగన్ అనుకున్నారు. అయితే ఆయన సన్నిహితులు ఆ పేరుతో కార్యక్రమం వద్దని, వైఎస్ఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లే చనిపోయిన విషాదాంతాన్ని గుర్తు చేశారు. దీంతో రచ్చబండ కార్యక్రమాన్ని పక్కన పెట్టారని.. దాని స్థానంలో ప్రజాదర్బార్‌ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తున్నది.

ప్రజాదర్బార్ అనే సరికి రాష్ట్ర నలుమూలల నుంచి తప్పకుండా వేలాది మంది వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యమంత్రికి చెప్పుకుంటే తమ సమస్య పరిష్కారం అవుతుందని భావించే వాళ్లు చాలా మంది ఉంటారు. ఇది ఒక వారం, నెల రోజుల్లో ముగిసే కార్యక్రమం కాదు. అందుకే ముందుగా ఆరు నెలల పాటు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఆ కార్యక్రమం ద్వారా ప్రజలు సంతృప్తి చెందితే.. ఆ తర్వాత కూడా కొనసాగించాలని వైఎస్ జగన్ అనుకుంటున్నారు.

సీఎం దగ్గరకు వచ్చే సమస్యల్లో ఎక్కువగా ఇంటి పట్టాలు, పింఛ‌న్లు ఇప్పించాలని వచ్చే వారే ఎక్కువగా ఉండొచ్చని.. అలాగే రైతులు, ఆరోగ్యశ్రీ లబ్దిదారులు కూడా రావొచ్చని అంచనా వేస్తున్నారు. సివిల్ వివాదాలను ఎలాగూ ఇలాంటి చోటకు తీసుకొని రారు. కాబట్టి సీఎం వద్దకు వచ్చే సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించేలా ఒక యంత్రాంగాన్ని జగన్ సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ వద్దకు వెళ్లగానే సమస్య పరిష్కారం అయ్యిందనే ప్రచారం ప్రభుత్వం, పార్టీకి చాలా లాభం తెచ్చిపెడుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించడానికి సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పుడు వైఎస్ జగన్ చేపడుతున్న ఈ ప్రజాదర్బార్ ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిస్తోంది. ఆరు నెలల పాటు ప్రజల సమస్యలు వినడమంటే.. ప్రతిపక్షాలకు మాట రాకుండా చేయడమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజల వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తూనే.. సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా జగన్ ఒక పెద్ద అస్త్రాన్ని ప్రతిపక్షాలపై వదిలినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ ఒక కార్యక్రమం ప్రారంభిస్తే మధ్యలో వదిలేసే రకం కాదని ప్రతిపక్ష పార్టీలకు తెలుసు. ఈ కార్యక్రమం కనుక విజయవంతం అయితే.. అది పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారిపోతుందని భయపడుతున్నారు.

First Published:  25 July 2022 5:17 AM GMT
Next Story