Telugu Global
Andhra Pradesh

ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌..

“నా యుద్ధం పెత్తందార్లతోనే, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే.. ఇదే నా ఎకనామిక్స్‌ - ఇదే నా పాలిటిక్స్‌. ఇదే మానాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్.” అంటూ అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి.

ఇదే నా ఎకనామిక్స్‌.. ఇదే నా పాలిటిక్స్‌..
X

ప్రతిపక్షాలపై విమర్శలు లేవు, తాను చేసిందే చెప్పారు, చేయబోయేదాని గురించే మాట్లాడారు, తన ప్రయారిటీస్ ఏంటో కుండబద్దలు కొట్టారు. సూటిగా సుత్తిలేకుండా అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రసంగించారు.

పారిశ్రామిక రంగం ఎంత ముఖ్యమో, వ్యవసాయం కూడా తనకు అంతే ముఖ్యం అన్నారు సీఎం జగన్. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో, అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యం అని కుండబద్దలు కొట్టారు. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమేనన్నారు. గత ప్రభుత్వానివి అన్నీ గాలి మాటలేనని.. టీడీపీ ప్రభుత్వం గాల్లో నడిస్తే.. తాను నేలపై నడుస్తున్నానని చెప్పారు.


“నా యుద్ధం పెత్తందార్లతోనే, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే.. ఇదే నా ఎకనామిక్స్‌ - ఇదే నా పాలిటిక్స్‌. ఇదే మానాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్.” అంటూ అసెంబ్లీలో ఆకట్టుకునేలా ప్రసంగించారు.

ఇప్పటి వరకు 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించామని, అభివృద్ధిలో దేశానికే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచిందని చెప్పారు జగన్. ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ తీసుకొచ్చామని, రాష్ట్రంలో 1.36 కోట్ల మంది దిశయాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని గుర్తు చేశారు. 11.28 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదని, ఆర్థిక నిపుణులే అధ్యయనం చేసేలా ఏపీలో ఆర్థిక వృద్ధి రేటు ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలతో ఒకేసారి 1.34 లక్షలమందికి ఉపాధి కల్పించామన్నారు. ఊరూరా వాలంటీర్లు నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి మంచి చేస్తున్నారని అన్నారు.

నాడు-నేడు కింద పాఠశాలల రూపు రేఖలు మార్చామని, రేషన్ సరకులను డోర్ డెలివరీ చేస్తున్నామని, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు సీఎం జగన్. పారదర్శకత తీసుకువచ్చేలా నాలుగేళ్ల తమ పాలన సాగిందని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన 98.5 శాతం హామీలు అమలు చేశామన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశామని, అందరికీ మంచి చేశామని చెప్పుకొచ్చారు. లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోందన్నారు. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి అంటారని, తన హయాంలో అదే జరుగుతోందని వివరించారు.

First Published:  15 March 2023 12:05 PM GMT
Next Story