Telugu Global
Andhra Pradesh

చ‌దువులపై ఆస‌క్తి పెంచాల‌నే ఆ ప‌థ‌కంలో నిబంధ‌న‌లు చేర్చాం

అమ్మ ఒడి పథకం ఇంటర్‌ వరకు కూడా వర్తిస్తుందని, ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అవకాశం ఉండటంతో గ్రాడ్యుయేషన్‌ పైనా దృష్టిపెడతారని వివరించారు.

చ‌దువులపై ఆస‌క్తి పెంచాల‌నే ఆ ప‌థ‌కంలో నిబంధ‌న‌లు చేర్చాం
X

చదువుపై ఆసక్తి పెరగాలనే వైఎస్సార్ షాదీతోఫా, కల్యాణమస్తు పథకాల అమలులో నిబంధనలు పెట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది జంటలకు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ గురువారం విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు. అంతకుముందు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి.. వారికి గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసే క్రమంలో తల్లిదండ్రులకు సహాయంగా ఉండేందుకే ఈ కార్యక్రమం తలపెట్టినట్టు సీఎం జగన్‌ చెప్పారు.

ఈ పథకానికి అర్హతగా పదో తరగతి ఉత్తీర్ణత, వధువుకు 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాల నిబంధన పెట్టామని జగన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనికి ప్రధాన కారణం.. బాల్య వివాహాలు పూర్తిగా తగ్గించడమని, టెన్త్‌ సర్టిఫికెట్‌ నిబంధన వల్ల ప్రతి కుటుంబం కూడా తమ పిల్లలను చదివించడం కోసం ప్రయత్నిస్తుందనే ఉద్దేశమని చెప్పారు. 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లికి ఆగాలి కాబట్టి.. పిల్లలను ఇంటర్మీడియట్‌ కూడా చదివిస్తారని తెలిపారు.

అమ్మ ఒడి పథకం ఇంటర్‌ వరకు కూడా వర్తిస్తుందని, ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అవకాశం ఉండటంతో గ్రాడ్యుయేషన్‌ పైనా దృష్టిపెడతారని వివరించారు. పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేస్తే అప్పుడు ఒక జనరేషన్‌ మార్పు వస్తుందని, పిల్లల తలరాతలు మార్చే గొప్ప అస్త్రం చదువు అని, పేదరికం నుంచి బయటపడే గొప్ప పరిస్థితి చదువుతో ఏర్పడుతుందని, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఈ పథకాన్ని తీసుకువచ్చామని సీఎం వివరించారు.

First Published:  23 Nov 2023 12:45 PM GMT
Next Story