Telugu Global
Andhra Pradesh

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం - సీఎం జగన్

సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి రీసైకిల్ చేసి పార్లే సంస్థ తయారు చేసిన పలు ఉత్పత్తులను సీఎం జగన్ పరిశీలించారు. రీసైక్లింగ్ చేసి తయారు చేసిన కళ్లజోడు, బూట్లను ఆయన పరిశీలించారు

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం - సీఎం జగన్
X

ప్లాస్టిక్ వస్తువులతో ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఏపీలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్. క్లాత్‌తో తయారు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే వినియోగించాలని ఆయన సూచించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో 'పార్లే ఫర్‌ ది ఓషన్స్‌' సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు సీఎం జగన్.

విశాఖపట్నంలో కోస్టల్‌ బ్యాటరీ ప్రాంతం నుంచి భీమిలి వరకు వాలంటీర్లు బీచ్ నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం అని అన్నారు జగన్. 76 టన్నుల ప్లాస్టిక్‌ ను సముద్రం తీరం నుంచి తొలగించారని చెప్పారు. ఏపీ తీర ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపై ఉందని చెప్పారాయన. సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి రీసైకిల్ చేసి పార్లే సంస్థ తయారు చేసిన పలు ఉత్పత్తులను సీఎం జగన్ పరిశీలించారు. రీసైక్లింగ్ చేసి తయారు చేసిన కళ్లజోడు, బూట్లను ఆయన పరిశీలించారు. ఏపీలో త్వరలో పార్లే ఫ్యూచర్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటవుతుందని చెప్పారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని ప్రకటించారు.

అమలయ్యే అవకాశముందా..?

ప్లాస్టిక్ పై నిషేధం. వినడానికి చాలా హాయిగా ఉంటుంది కానీ ఆచరణలో మాత్రం ఇది అసాధ్యం అని చాలాసార్లు తేలిపోయింది. తిరుమలలో పట్టుబట్టి ప్లాస్టిక్ నిషేధాన్ని కొనసాగిస్తున్నా.. అక్కడ పూర్తిస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక భక్తులు అవస్థలు పడుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఏపీలో కూడా ఏ సిటీకి కొత్త మున్సిపల్ కమిషనర్ వచ్చినా ప్లాస్టిక్ పై నిషేధం అంటూ హడావిడి చేస్తారు, ఆ తర్వాత చల్లారిపోతారు. ఇక తాజాగా సీఎం జగన్ ప్లాస్టిక్ బ్యానర్లపై నిషేధం అంటూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బ్యానర్లపై నిషేధం అంటే అది కేవలం ప్లాస్టిక్ పైనే కాదు, రాజకీయ కాలుష్యంపై కూడా నిషేధం విధించినట్టే. అసలే ఎన్నికల సీజన్ తరుముకొస్తోంది, ఈదశలో ప్లాస్టిక్ బ్యానర్లు తీసేసి క్లాత్‌ బ్యానర్లు వాడాలంటే కుదిరే పనేనా..? వినైల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులు ఊరికొకటి పుట్టుకొచ్చాయి. మరి వారికి కొత్త ఉపాధి ఎలా..? లక్షల రూపాయలు పెట్టి కొన్న మెషినరీని పక్కనపెట్టాలంటే ఎవరికి మాత్రం మనసొప్పుతుంది. ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం పూర్తి స్థాయిలో అమలవుతుందా లేదా అనేది మాత్రం అనుమానమే.

First Published:  26 Aug 2022 10:51 AM GMT
Next Story