Telugu Global
Andhra Pradesh

ఇన్ చార్జ్ ల మార్పు.. వైసీపీకి ప్లస్సా..? మైనస్సా..?

ప్రజల్లో అసంతృప్తి ఆ స్థాయిలో ఉందనుకోలేం. ఒకవేళ సీఎం జగన్ ఇంకాస్త ఎక్కువగా ఊహించుకున్నారని అనుకున్నా దానికి ఇన్ చార్జ్ ల మార్పు అనేది పరిష్కారం అనుకోలేం.

ఇన్ చార్జ్ ల మార్పు.. వైసీపీకి ప్లస్సా..? మైనస్సా..?
X

తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఏపీలో అధికార వైసీపీ కీలక మార్పులు చేర్పులతో ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ల్లో చాలామందికి సీట్లు ఇవ్వట్లేదని తేలిపోయింది. ఉన్నవారిని కూడా అటు, ఇటు మార్చేస్తున్నారు సీఎం జగన్. అంటే ఒక నియోజకవర్గంలో గెలవలేరు అనుకున్నవారిని ఇంకో నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ప్రకటిస్తున్నారు, రేపు వారికి అక్కడే సీటు ఖాయం అనుకోవాలి. కొంతమంది మంత్రులకు కూడా స్థాన చలనం కలగడం ఇక్కడ విశేషం. వీర విధేయులనుకున్నవారికి కూడా ఈసారి టికెట్ దక్కకపోవడం మరో విశేషం.

ఇన్ చార్జ్ లను మారుస్తున్నారు సరే.. అక్కడ గెలవలేని వారు, ఇక్కడెలా గెలుస్తారంటూ ప్రతిపక్షాలు లాజిక్ తీస్తున్నాయి. ఒకవేళ నిజంగా జగన్ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటే అది టీడీపీ-జనసేనకే లాభం కదా, ఇలా గుర్తు చేసి మరీ జగన్ ను అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా..? తాము ఇన్ చార్జ్ లను మార్చేస్తుంటే ప్రతిపక్షాలు భయపడిపోతున్నాయని, వణికిపోతున్నాయని వైసీపీ కూడా ఘాటుగా బదులిస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా.. జగన్ ప్రయోగం ఎలాంటి ఫలితాలనిస్తుందనేది వేచి చూడాలి.

తెలంగాణలో ఎన్నికల ఫలితాల వల్లే ఏపీలో సీఎం జగన్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన బలంగా వినపడుతోంది. నిజంగానే తెలంగాణలో సిట్టింగ్ లకు అధిక సంఖ్యలో సీట్లివ్వడం బీఆర్ఎస్ కి కలసిరాలేదా..? అంటే అందులో పూర్తిగా వాస్తవం ఉంది అనుకోలేం. అదే సమయంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ సిట్టింగ్ లు గెలిచి తిరిగి అసెంబ్లీకి వచ్చారు. వారి విజయాన్ని ఎలా చూడాలి..? ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే అది ప్రభుత్వంపైనా, లేక స్థానిక ఎమ్మెల్యేపైనా.. అనేది అంచనా వేసుకోవాలి. ఆ అంచనా కరెక్ట్ గా ఉన్నప్పుడే తిరిగి అధికారం హస్తగతం అవుతుంది. పరిస్థితి తేడాగా ఉంది అనుకుంటే కేవలం ఇన్ చార్జ్ లను మారిస్తే సరిపోదు, ప్రభుత్వ విధానాలను, ప్రాధాన్యతలను కూడా మార్చుకోవాల్సిందే. మరి జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఏమేరకు సక్సెస్ అవుతుందనేది మరికొన్ని నెలల్లో తేలిపోతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఒక్క ఛాన్స్ అన్న కాంగ్రెస్ నేతల అభ్యర్థనను కొన్నిచోట్ల ప్రజలు మన్నించారు, అందుకే ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ పస ఏంటో రాష్ట్రం ఏర్పడిన తొలి ఐదేళ్లలోనే ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. పైగా వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు సంతృప్త స్థాయిలో అందుతున్నాయి కూడా. ఈ దశలో ప్రజల్లో అసంతృప్తి ఉందనుకోలేం. ఒకవేళ జగన్ ఇంకాస్త ఎక్కువగా ఊహించుకున్నారని అనుకున్నా దానికి ఇన్ చార్జ్ ల మార్పు అనేది పరిష్కారం అని కూడా అనుకోలేం. మొత్తానికి ప్రయోగం మొదలైంది, దాని ఫలితం రావాల్సి ఉంది.

First Published:  22 Dec 2023 5:21 AM GMT
Next Story