Telugu Global
Andhra Pradesh

ముంపు మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ : సీఎం వైఎస్ జగన్

చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాలతో ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.

ముంపు మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్ : సీఎం వైఎస్ జగన్
X

గోదావరి వరద బాధితులను పరామర్శించే కార్యక్రమాన్ని సీఎం జగన్ రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్.. రాత్రి రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. ఇక రెండో రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమండ్రి నుంచి నేరుగా చింతూరు మండలం కుయుగూరు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వరద బాధితులతో సీఎం జగన్ ముఖాముఖి సమావేశం అయ్యారు.

వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదని, ఈ సీజన్ ముగియక ముందే అందరికీ పరిహారం అంది తీరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బాధితులందరికీ రేషన్, కుటుంబానికి రూ. 2 వేల సాయం చేశామని జగన్ చెప్పారు. వరద కారణంగా నిర్వాసితులు అయిన వారికి కావల్సిన వనరులు సమకూర్చమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మీ అందరికీ సాయం అందిందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. తమకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని కుయుగూరు వరద బాధితులు సీఎంకు చెప్పారు.

కాగా, ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలవరం కారణంగా ముంపునకు గురవుతున్న నాలుగు మండలాలను కలిపి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న చింతూరు, వీఆర్ పురం, కూనవరంతో పాటు భద్రాచలం రూరల్ తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లాయి. ఇప్పుడు అవే మండలాలు కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి.

చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాలతో ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతే కాకుండా పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 20 వేల కోట్లు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. వెయ్యో.. రెండు వేల కోట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వమే సర్దుబాటు చేసేదని, ఇది భారీ వ్యయంతో కూడింది కాబట్టే కేంద్రం సహాయం చేస్తేనే కుదురుతుందని సీఎం అన్నారు.

నిర్వాసితులకు పరిహారం ఇచ్చేలా కేంద్రంతో కుస్తీ పడుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ ఆఖరు లోగా పోలవరం నిర్వాసితులు అందరికీ పరిహారం అందేలా చూస్తామని అన్నారు. అందరికీ పూర్తి పరిహారం లభించిన తర్వాత మాత్రమే పోలవరాన్ని నింపుతామని.. ఏ ఒక్కరికీ అన్యాయం చేయమని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇక సీఎం జగన్ మధ్యాహ్నం తర్వాత ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలంలోని కన్నయ్యగుట్ట, తిరుమలాపురం, నార్లవరం గ్రామాల్లో పర్యటిస్తారు.

First Published:  27 July 2022 8:07 AM GMT
Next Story