Telugu Global
Andhra Pradesh

పింఛన్ల తొలగింపు నోటీసులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

పింఛన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి అడిట్ జరుగుతుందని.. అందులో భాగంగా కొందరికి నోటీసులు ఇచ్చి ఉండవచ్చన్నారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు.

పింఛన్ల తొలగింపు నోటీసులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు
X

ఏపీలో పెద్ద ఎత్తున పింఛన్లు తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. నెల్లూరు వైసీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ అంశంపై వార్త‌ల్లోకి ఎక్కడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం తిప్పికొట్టారు. జనవరి ఒకటి నుంచి పెంచిన మొత్తంతో పింఛన్లు అందజేసేందుకు సిద్ధమవుతుండడాన్ని జీర్ణించుకోలేక విచిత్రంగా తప్పుడు ప్రచారానికి దిగారని సీఎం విమర్శించారు. మంచి పనులను కూడా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని.. ఈ విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

పింఛన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి అడిట్ జరుగుతుందని.. అందులో భాగంగా కొందరికి నోటీసులు ఇచ్చి ఉండవచ్చన్నారు. అందులో తప్పేముందని ప్రశ్నించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలి.. అనర్హులకు అందకూడదు అన్నదే ప్రభుత్వం ఉద్దేశమన్నారు.

లబ్దిదారుల విషయంలో ఎక్కడైనా అనుమానాలు ఉంటే నోటీసులు ఇస్తారని.. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్ చేస్తారని జగన్ చెప్పారు. అర్హత ఉంటే పథకాలు అందుతాయన్నారు. నోటీసులు అందుకున్న వారి నుంచి సమాధానం తీసుకోకుండా ఏకపక్షంగా పింఛన్లు తొలగించే ప్రసక్తే ఉండదన్నారు. కానీ కొందరు నోటీసులను చూపించి పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు.

టీడీపీ హయాంలో కేవలం 39 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేవారని ఇప్పుడు 62 లక్షల 70వేల మందికి ఇస్తున్నామని సీఎం వివరించారు. గతంలో వెయ్యి రూపాయలు మాత్రమే పింఛన్ ఇచ్చారని.. ఇప్పుడు 2500 ఇస్తున్నామని.. జనవరి ఒకటి నుంచి 2750 రూపాయలు ఇవ్వబోతున్నామన్నారు. ఇంతగా మంచి చేస్తున్నా విష ప్రచారం ఆగడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పేదవాడికి ఈ ప్రభుత్వం అన్యాయం చేయబోదన్నారు.

ఎలాంటి లంచాలకు తావు లేకుండా, వివక్ష లేకుండా అర్హులందరికి పథకాలు అందిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. గతంలో ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల అనుమతి కోసం వెళ్లాల్సి వచ్చేదని.. లబ్దిదారులు ఏ పార్టీ వారు అన్నది చూసి.. లంచాలు తీసుకుని పథకాలు ఇచ్చారన్నారు. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.

First Published:  27 Dec 2022 7:35 AM GMT
Next Story