Telugu Global
Andhra Pradesh

నేటినుంచి జగనన్న సురక్ష.. సర్టిఫికెట్లన్నీ ఫ్రీ.. ఫ్రీ..

రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాల వద్దకు అధికారులు వెళ్తారు. నెలరోజుల్లో 15వేల సచివాలయాల్లో ఈ సురక్షా క్యాంపులు నిర్వహిస్తారు. సర్టిఫికెట్లు ఇవ్వడంతోపాటు 100 శాతం అర్హులను ప్రభుత్వ పథకాల్లో చేర్చుతారు.

నేటినుంచి జగనన్న సురక్ష.. సర్టిఫికెట్లన్నీ ఫ్రీ.. ఫ్రీ..
X

ఏపీలో జగనన్న సురక్ష అనే సరికొత్త కార్యక్రమం ఈరోజు నుంచి మొదలైంది. సీఎం జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా నెలరోజులపాటు జగనన్న సురక్ష ద్వారా ఏపీ ప్రజలు ప్రయోజనం పొందబోతున్నారు. ఈ నెలరోజులపాటు అధికారులే ప్రజల ఇళ్లకు వస్తారు. వారి సమస్యలు వింటారు, పరిష్కారం చూపిస్తారు.


సర్టిఫికెట్లన్నీ ఫ్రీ.. ఫ్రీ..

జగనన్న సురక్షలో భాగంగా అన్నిరకాల ధృవపత్రాలు ఉచితంగా ఇస్తామంటోంది ప్రభుత్వం నెలరోజులపాటు ప్రజల ఇళ్లకు వచ్చే అధికారులు వారికి అవసరమైన ధృవపత్రాల వివరాలు నమోదు చేసుకుంటారు. రుసుము లేకుండానే దరఖాస్తులు తీసుకుంటారు. వాటిని ప్రాసెస్ చేసి వెంటనే సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు. ఉచితంగా సర్టిఫికెట్లు ఇస్తారు.

ఇంటింటికీ గృహసారథులు..

ఈ రోజు నుంచి వైసీపీ నేతలు, గృహ సారథులకు శిక్షణ ఇస్తారు. జులై 1 నుంచి ఇంటింటికీ వైసీపీ కేడర్‌ తిరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తారు. సచివాలయ సిబ్బంది ప్రజల ఇళ్లకు వెళ్లి వారికి కావాల్సిన సర్టిఫికెట్ల వివరాలు నమోదు చేసుకుంటారు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. స్పాట్‌ లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాల వద్దకు అధికారులు వెళ్తారు. నెలరోజుల్లో 15వేల సచివాలయాల్లో ఈ సురక్షా క్యాంపులు నిర్వహిస్తారు. సర్టిఫికెట్లు ఇవ్వడంతోపాటు 100 శాతం అర్హులను ప్రభుత్వ పథకాల్లో చేర్చుతారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందనివారికి సంక్షేమ ఫలాలు అందేలా చేస్తారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలను చెబుతుంటే.. జగనన్న సురక్ష ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చి, కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

First Published:  23 Jun 2023 6:02 AM GMT
Next Story