Telugu Global
Andhra Pradesh

వాళ్లు కమీషన్లు దండుకున్నారు.. నేను పనులు పూర్తి చేశా..

తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌లను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమీషన్ల కోసమే ముందుకు నడిపించాయని అన్నారు సీఎం జగన్. నిర్మాణాలు పూర్తిచేయాలనే చిత్తశుద్ధి వారికి లేదని, అందుకే టీడీపీ హయాంలో ఈ రెండు బ్యారేజ్ లు పూర్తి కాలేదన్నారు.

వాళ్లు కమీషన్లు దండుకున్నారు.. నేను పనులు పూర్తి చేశా..
X

నెల్లూరు జిల్లాలో సంగం, పెన్నా బ్యారేజ్ లను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు సీఎం జగన్. 14 ఏళ్ల క్రితం ఈ రెండు ప్రాజెక్ట్ లకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపనలు చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వీటిని ప్రారంభించడం విశేషం. ఈ రెండు ప్రాజెక్ట్ లకు తన తండ్రి శంకుస్థాపన చేశారని, ఆ పెద్దాయన కొడుకుగా, ఆ మహానేత కొడుకుగా తాను వాటిని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు జగన్. సంగం, పెన్నా బ్యారేజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీలోని సాగునీటి ప్రాజెక్ట్ ల విషయంలో తన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు సీఎం జగన్.

కమీషన్ల కోసం టీడీపీ..

తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌లను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కమీషన్ల కోసమే ముందుకు నడిపించాయని అన్నారు సీఎం జగన్. నిర్మాణాలు పూర్తిచేయాలనే చిత్తశుద్ధి వారికి లేదని, అందుకే టీడీపీ హయాంలో ఈ రెండు బ్యారేజ్ లు పూర్తి కాలేదన్నారు. తన హయాంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రెండు బ్యారేజ్ లను పూర్తి చేశానని చెప్పారు జగన్. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 సాగునీటి ప్రాజెక్ట్ లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

భారీ బందోబస్తు మధ్య..

సీఎం జగన్ నెల్లూరు సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సీపీఎస్ రద్దుకోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులు నిరసన తెలియజేసే అవకాశముందనే సమాచారంతో సభకు వచ్చేవారి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగులను సభకు తరలించారు. ప్రతి మండలంలోనూ వైసీపీ కార్యకర్తలను సెలక్ట్ చేసుకుని మరీ సభకు తీసుకొచ్చారు. నెల్లూరు నగరంలో పోలీసులు మరీ జాగ్రత్తగా ఉండటం విశేషం. సంగంలో జరిగిన సభలో నాయకులను, స్థానిక ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే మేకపాటి విక్ర‌మ్‌ రెడ్డి, సీఎం జగన్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి జగన్ నెల్లూరు వచ్చి, నెల్లూరు బ్యారేజ్ ని ప్రారంభించారు. నెల్లూరులో మాత్రం కార్పొరేటర్లు సైతం బారికేడ్ల వెలుపల నిలబడాల్సి వచ్చింది. బ్యారేజ్ చుట్టుపక్కల పరదాలు కట్టి పక‌డ్బందీగా ఏర్పాట్లు చేశారు.

First Published:  6 Sep 2022 10:55 AM GMT
Next Story