Telugu Global
Andhra Pradesh

ఢిల్లీలో జగన్, రేపు మోదీతో కీలక భేటీ..

విభజన హామీల అమలులో రెండు తెలుగు రాష్ట్రాలను దారుణంగా మోసం చేసింది బీజేపీ. పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలు విభజన హామీలను ప్రస్తావిస్తూ లేఖలు రాసినా, నేరుగా కలసి విన్నపాలు ఇచ్చినా మోదీలో చలనం లేదు.

ఢిల్లీలో జగన్, రేపు మోదీతో కీలక భేటీ..
X

ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయనకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఉంది. ప్రస్తుత భేటీపై పెద్దగా ఊహాగానాలేవీ లేకపోయినా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మరోసారి ప్రధానికి గుర్తు చేసేందుకే జగన్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.

కంఠశోష తప్ప ఉపయోగముందా..?

విభజన హామీల అమలులో రెండు తెలుగు రాష్ట్రాలను దారుణంగా మోసం చేసింది బీజేపీ. పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలు విభజన హామీలను ప్రస్తావిస్తూ లేఖలు రాసినా, నేరుగా కలసి విన్నపాలు ఇచ్చినా మోదీలో చలనం లేదు. అటు తెలంగాణలో బీఆర్ఎస్ నేరుగా బీజేపీపై యుద్ధం ప్రకటించింది. ఇటు ఏపీలో మాత్రం అధికార వైసీపీ కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడంలేదు. ఈ నేపథ్యంలో మరోసారి జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

పోలవరం నిధులు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై ప్రధానికి జగన్ వినతిపత్రం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ పనుల కోసం రూ. 2.9 వేల కోట్లు ఖర్చు చేసింది. వీటిని కేంద్రం తిరిగి ఇవ్వాల్సి ఉన్నా బకాయిలు విడుదల కాలేదు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. 15రోజుల్లోగా నిధులు ఇప్పించడంతోపాటు, టెక్నికల్‌ అడ్వైజర్‌ కమిటీ నిర్ధారించిన ప్రాజెక్టు వ్యయం 55,548 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని కోరబోతున్నారు.

తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన 6,756 కోట్ల రూపాయల బకాయిల అంశాన్ని కూడా ఏపీ సీఎం జగన్, ప్రధాని వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది. మెడికల్ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయింపుపై కూడా ప్రధానికి నివేదిక ఇవ్వబోతున్నారు జగన్. హోదా అంశం అటకెక్కినట్టేనని తెలిసినా కూడా మరోసారి ఏపీ ప్రజల కంటి తుడుపుగా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రధాని వద్ద ప్రత్యేకంగా ప్రస్తావిస్తారట.

First Published:  27 Dec 2022 4:43 PM GMT
Next Story