Telugu Global
Andhra Pradesh

దత్తపుత్రా..! మూడు పెళ్లిళ్లతో సమాజానికి ఏం సందేశం ఇస్తావ్.. ?

మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ పవన్ సమాధానమిస్తున్నారని, ఇలాంటి వారితో సమాజానికి ఏం ఉపయోగం అన్నారు జగన్. ప్రజలంతా మూడు పెళ్లిళ్లు చేసుకుంటే సమాజం ఏమైపోతుందని ప్రశ్నించారు.

దత్తపుత్రా..! మూడు పెళ్లిళ్లతో సమాజానికి ఏం సందేశం ఇస్తావ్.. ?
X

ఏ మాటలంటే పవన్ కల్యాణ్ ఫైరవుతున్నారో, సరిగ్గా అవే మాటల్ని మళ్లీ రిపీట్ చేశారు సీఎం జగన్. అవనిగడ్డ సభలో ఆయన పవన్ కల్యాణ్ పై పంచ్ లు విసిరారు. దత్తపుత్రుడు అని పదే పదే నొక్కిమరీ చెప్పారు. దత్తపుత్రుడు మన పార్టీకి అవసరం లేదన్నారు. `మనకి ఛానళ్లు లేవు, హంగులు, ఆర్భాటాలు లేవు, కేవలం ప్రజలపై, దేవుడిపై నమ్మకం మాత్రమే ఉంది`అన్నారు జగన్.

మూడు పెళ్లిళ్లతో ఏం చెబుతావు..?

మూడు రాజధానుల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కానీ, మూడు పెళ్లిళ్ల వల్ల ఏం జరుగుతుందని ప్రశ్నించారు సీఎం జగన్. అదేమంటే.. మీరూ చేసుకోండి అంటూ పవన్ సమాధానమిస్తున్నారని, ఇలాంటి వారితో సమాజానికి ఏం ఉపయోగం అన్నారు. ప్రజలంతా మూడు పెళ్లిళ్లు చేసుకుంటే సమాజం ఏమైపోతుందని అన్నారు. ఎంతో కొంత ఇచ్చి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవడం అనే సంస్కృతిని ఎవరైనా ఎందుకు మెచ్చుకుంటారన్నారు. ఇలాంటివాళ్లా మన నాయకులు? ఇలాంటివారు అధికారంలోకి వస్తే మన బిడ్డలు, అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు రాగలరా అని ప్రశ్నించారు సీఎం జగన్. కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారని, బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారని ఎద్దేవా చేశారు.

మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయండి..

నిషేధిత జాబితానుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని బటన్ నొక్కి అవనిగడ్డ నుంచి ప్రారంభించారు సీఎం జగన్. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పత్రికలు చదవొద్దని, ఛానళ్లు చూడొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటికి, తమకు ఏం మంచి జరిగిందనే విషయాలను మాత్రమే ఆలోచించాలని, మంచి జరిగిందని అనిపిస్తేనే వైసీపీకి ఓటు వేయాలని చెప్పారు. పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తల్ని అస్సలు నమ్మొద్దని చెప్పారు జగన్.

Next Story