Telugu Global
Andhra Pradesh

దోచుకునే చాన్స్ లేదు .. అందుకే కడుపు మంట.. - పచ్చ మీడియా సహా.. చంద్రబాబు, పవన్ పై జగన్ విమర్శలు

ఈ ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుంటే చూస్తూ సహించలేకపోతున్నారు. అందుకే ఉదయం నిద్ర లేచింది మొదలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు.

దోచుకునే చాన్స్ లేదు .. అందుకే కడుపు మంట.. - పచ్చ మీడియా సహా.. చంద్రబాబు, పవన్ పై జగన్ విమర్శలు
X

'మేం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు న్యాయం చేస్తున్నాం. కులం, మతం, పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్నాం. కానీ కొంతమందికి ఇది నచ్చడం లేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఏబీఎన్, టీవీ5, పవన్ దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్లకు అవకాశం లేదు. ఈ ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుంటే చూస్తూ సహించలేకపోతున్నారు. అందుకే ఉదయం నిద్ర లేచింది మొదలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు' అని సీఎం జగన్ మండిపడ్డారు.

ఇటీవల ముఖ్యమంత్రి జగన్ ఏ బహిరంగ సభలో ప్రసంగించినా.. పచ్చమీడియా, చంద్రబాబు, పవన్‌ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ బాపట్లలో ఆయన జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్ మెంట్ ) పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులెవరూ చదువుకు దూరం కాకూడదన్న కారణంతోనే తాను ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని అన్నారు.

'ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యాదీవెన చెల్లిస్తున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్ల రూపాయలు జ‌మ చేశాం. విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రక్షణ పరంగా అన్నిరకాలుగా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం.' అని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన, మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. కాలంతోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చామని చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ప్రాథమిక విద్యలోనే కాకుండా పెద్ద చదువులను కూడా పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి.. 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నామన్నారు. తల్లి దండ్రులు తమ బిడ్డలను బాగా చదివించాలని.. ఫీజులు ఎంతైనా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

First Published:  11 Aug 2022 10:43 AM GMT
Next Story