క్రికెట్ భాషలో ఆడుకున్న జగన్, లోకేష్
వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలంటే మనం కఠినంగానే ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులతోపాటు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు జగన్.
"ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ చేయండి, ఎంతసేపు బ్యాక్ ఫుట్ ఆడతారు.." అంటూ తాజాగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ.. తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలపై కఠినంగా ఉండాలని, ఇకపై ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ చేయాలని సూచించారు. చంద్రబాబుతో సహా.. మనమంతా కొన్ని మీడియా సంస్థలతో యుద్ధం చేస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు జగన్. పనిగట్టుకుని తప్పుడు రాతలు రాసేవారి విషయంలో ఉదాసీనంగా ఉండకూడదని, వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలంటే మనం కఠినంగానే ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులతోపాటు, ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు జగన్.
గతంలో దుష్ట చతుష్టయం అంటూ చంద్రబాబు సహా, ఆయన అనుకూల మీడియాపై విమర్శలు చేసిన సీఎం జగన్, ఇప్పుడిలా నేరుగా అధికారుల్ని కూడా ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ చేయాలని చెప్పడాన్ని టీడీపీ తప్పుపడుతోంది. మీడియాపై ఫ్రంట్ ఫుట్ బ్యాటింగ్ అంటున్న సీఎం జగన్, క్లీన్ బౌల్డ్ అవ్వక తప్పదని, లేదా స్టంప్ అవుట్ అయినా అవుతారని బదులిచ్చారు నారా లోకేష్. సీఎం జగన్ దోపిడీని దశలవారీగా బయటపెడతామని హెచ్చరించారు. జగన్ కళ్లు మూసుకుని ఆడే ఫ్రంట్ ఫుట్ తో బొక్కబోర్లా పడక తప్పదని అన్నారు లోకేష్.
మా రోడ్లపై తిరుగుతూ..
గతంలో కూడా మా రోడ్లపై జగన్ పాదయాత్ర చేశారని సెటైర్లు వేసి, ఆ తర్వాత తీరిగ్గా నాలుక కరుచుకున్నారు టీడీపీ నాయకులు. మేం వేసిన రోడ్లపై తిరుగుతారా అంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది. టీడీపీ రోడ్లు వేసిందంటే చంద్రబాబు డబ్బులిచ్చారా, లేక లోకేష్ జేబులోనుంచి తీసిచ్చారా అని ప్రశ్నించారు ప్రజలు, ఎన్నికల్లో ఘాటుగా సమాధానం కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు లోకేష్. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన జగన్, తాము వేసిన సిమెంట్ రోడ్డుపైనే తిరిగారంటూ కామెడీ చేయాలని చూశారు. వెనక కార్లు కూడా వెళ్తుంటే, ముందు జగన్ ట్రాక్టర్లో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు సకాలంలో జరగలేదని విమర్శించారు.