Telugu Global
Andhra Pradesh

తండ్రి, కుమారులు కలిసే కుట్ర చేశారు - సీఐడీ డీఐజీ

కాలువ భూమిని ఆక్రమించినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ నాయక్ తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు కలిసి కుట్ర పూరితంగా ఏఈ సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. పత్రాల్లో ఉన్నసంతకం ఈఏది కాదని వెల్ల‌డించారు.

తండ్రి, కుమారులు కలిసే కుట్ర చేశారు - సీఐడీ డీఐజీ
X

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై ఏపీ సీఐడీ కీలక వివరాలను వెల్లడించింది. రెండు సెంట్ల స్థలం ఆక్రమిస్తే.. అలాంటి సివిల్ కేసులో సీఐడీ పోలీసులు అరెస్ట్ ఎలా చేస్తారని టీడీపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సీఐడీ డీఐజీ సునీల్ కుమార్ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అక్రమించిన స్థలం తక్కువే కదా అని మాట్లాడడం అర్థరహితమన్నారు. ఫేక్ ఎన్‌ఓసీని సృష్టించి కాలువ భూమిని కబ్జా చేశారని వివరించారు. కాలువ భూమిని ఆక్రమించినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆయన కుమారులు కలిసి కుట్ర పూరితంగా ఏఈ సంతకాన్ని ఫోర్జరీ చేశారని.. పత్రాల్లో ఉన్నసంతకం ఈఏది కాదని తేలిందన్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లికార్జున రావు ఫిర్యాదు చేశారని.. ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని కోర్టుకు కూడా సమర్పించినట్టు సునీల్ కుమార్ నాయక్ వివరించారు.

పదేళ్ల వరకు జైలు శిక్ష పడే సెక్షన్లు ఉన్నందున అరెస్ట్‌ చేశామన్నారు. పైగా అయ్యన్నపాత్రుడు పలుకుబడి ఉన్న వ్యక్తి అని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడిని అర్ధ‌రాత్రి అరెస్ట్ చేయలేదని.. తెల్లవారుజామున నాలుగు గంటలకు అరెస్ట్ చేశామన్నారు. బలవంతంగా లోపలికి వెళ్లడంపైన స్పందించిన సునీల్ కుమార్ నాయక్... నిందితుడు సహకరించకపోతే బలవంతంగా ముందుకెళ్లేందుకు చట్టం అవకాశం ఇస్తుందన్నారు. అయ్యన్నపాత్రుడిని తోసేశారు, కొందరు పోలీసులు చేయిచేసుకున్నట్టుగా కూడా ఉందని విలేకర్లు ప్రశ్నించగా... నిందితులు సహకరించకపోతే బలప్రయోగం ముందుకెళ్లడం చట్టబద్దమేనన్నారు.

First Published:  3 Nov 2022 9:23 AM GMT
Next Story