Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబును ఎందుకు అరెస్టు చేశారు..?

చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు సీఐడీ అధికారులు తరలించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు త‌ర‌లించారు.

చంద్ర‌బాబును ఎందుకు అరెస్టు చేశారు..?
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్టు చేసింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున‌ సుమారు 5.30 గంటలకు ఒక ఫంక్షన్ హాలులో బసచేసిన చంద్రబాబును అక్కడే అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ చంద్రబాబుపై ఏ1గా కేసు నమోదుచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్-1988 కింద చంద్ర‌బాబును అరెస్టుచేశారు. దాదాపు రు. రూ.371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేస్తారని ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. తనను అరెస్టు చేయచ్చని చంద్రబాబు కూడా రెండు రోజులుగా చెబుతున్న విషయం చూస్తున్నదే.

తనను అరెస్టు చేయటానికి వచ్చిన సీఐడీ పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. ఏ ఆధారాలతో తనను అరెస్టు చేస్తున్నారో చెప్పాలని పదేపదే డిమాండ్లు చేశారు. అయితే కుంభకోణానికి సంబంధించి, అరెస్టుకు సంబంధించిన రిమాండు రిపోర్టును తాము కోర్టుకు అందించాం కాబట్టి అన్నీ వివరాలు తొందరలోనే తెలుస్తాయని సీఐడీ అధాకారులు బదులిచ్చారు. తాము ప్రొసీజర్ ప్రకారమే నడుచుకుంటున్నట్లు సీఐడీ అధికారులు స్పష్టంగా చెప్పారు.

చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు సీఐడీ అధికారులు తరలించేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు త‌ర‌లించారు. రూ. 3300 కోట్ల కుంభకోణంలో రూ. 371 కోట్లు చేతులు మారాయ‌ని సీఐడీ గుర్తించింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష‌న్‌ ఒప్పందం చేసుకుంది. అందులో రూ. 371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా అయితే మిగిలింది సీమెన్స్ కంపెనీపెట్టాలి.

ఆ కంపెనీ ఒక్క రూపాయి పెట్టుబడిపెట్టకుండానే ప్రభుత్వం రూ. 371 కోట్లు విడుదల చేసేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహారంపై దర్యాప్తు జ‌రిపించింది. రాష్ట్ర ప్రభుత్వంతో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ కంపెనీ స్పష్టంగా చెప్పింది. జరిగిన ఒప్పందంతో తమ కంపెనీకి ఎలాంటి సంబంధంలేదని తేల్చి చెప్పేసింది. దాంతో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని అందరికీ అర్థ‌మైపోయింది. మొత్తం 28 మందిని సీఐడీ నిందితులుగా చెప్పి 8 మందిని అరెస్టు చేసింది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు జరిగింది.

*

First Published:  9 Sep 2023 1:15 AM GMT
Next Story