Telugu Global
Andhra Pradesh

యాక్షన్‌కు రియాక్షనా..? చింతకాయలకు సీఐడీ నోటీసులు

భారతీపే క్రియేషన్‌ కేసులోనే ఈ నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతోంది. అదే రోజు విజయ్‌ను సీఐడీ విచారణకు పిలవడం వెనుక దురుద్దేశం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది.

యాక్షన్‌కు రియాక్షనా..? చింతకాయలకు సీఐడీ నోటీసులు
X

చింతకాయల అయ్యన్నపాత్రుడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. సీఎం అయినా, మహిళా మంత్రులైనా, పోలీసులైనా సరే నోటికొచ్చినట్టు దూషిస్తుంటారు. తండ్రి బాటలోనే తనయుడి ప్రయాణం అన్నట్టు కుమారుడు చింతకాయల విజయ్‌ది అదే తీరు. ఈయన సోషల్ మీడియాలో అస‌త్య ప్రచారం, అనుచిత వ్యాఖ్య‌లు చేస్తుంటారు. కొద్దిరోజుల క్రితం సీఎం సతీమణి వైఎస్ భారతిపై.. భారతీపే అంటూ క్యూఆర్‌ కోడ్‌ను సృష్టించి ప్రచారం చేశాడు చింత‌కాయ‌ల విజయ్. వైఎస్‌ భారతిని లిక్కర్‌ డాన్‌గా అతడు ప్రచారం చేశారు. ఐ-టీడీపీలోనూ విజయ్ కీలక స్థానంలో ఉన్నారు.

వైఎస్ భారతిని కించపరిచిన వ్యవహారంలో ఇది వరకే సీఐడీ కేసు నమోదు చేసింది. నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్లగా త‌మ‌పై దాడి చేశారంటూ గతంలో రభస చేశారు. కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం కూడా విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే సీఐడీ పోలీసులు కూడా మధ్యలో చూసిచూడనట్టు వ్యవహరించారు. ఇంతలో మొన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయాడు.

ముఖ్యమంత్రిని చెత్తనాకొడుకు అనేశారు. పోలీసులను దూషించడంతో పాటు తాము అధికారంలోకి వచ్చాక ఇదే పోలీసులు తమ చంకలు నాకాల్సి ఉంటుందని మాట్లాడారు. మంత్రి రోజాను ఉద్దేశించి అస‌భ్యంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల తర్వాత చింతకాయలకు ఇంకా పులుపు తగ్గలేదని ప్రభుత్వం భావించిందో ఏమో గానీ.. ఆయన కుమారుడికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న మంగళగిరిలోని సీఐడీ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఐడీ ఆదేశించింది. సీఐడీ పోలీసులు వచ్చిన సమయంలో విజయ్ ఇంట్లో లేరు. తల్లి పద్మావతికి నోటీసులు అందజేసి సంతకాలు తీసుకున్నారు.

భారతీపే క్రియేషన్‌ కేసులోనే ఈ నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతోంది. అదే రోజు విజయ్‌ను సీఐడీ విచారణకు పిలవడం వెనుక దురుద్దేశం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. పాదయాత్రలో కీలక పాత్ర పోషించే నేతలను కట్టడి చేసేందుకే నోటీసులు ఇచ్చారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

First Published:  21 Jan 2023 3:36 AM GMT
Next Story