Telugu Global
Andhra Pradesh

చెరుకూరివారు గుంటూరు రావాల్సిందే.. రామోజీకి సీఐడీ నోటీసులు

కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పడం లేదన్నారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. గుంటూరు రావాల్సిందేనని నోటీసుల్లో పేర్కొన్నారు.

చెరుకూరివారు గుంటూరు రావాల్సిందే.. రామోజీకి సీఐడీ నోటీసులు
X

చెరుకూరివారు గుంటూరు రావాల్సిందే.. రామోజీకి సీఐడీ నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్స్ కుంభకోణంలో A-1 రామోజీరావు, A-2 శైలజా కిరణ్.. ఇద్దరూ విచారణకోసం గుంటూరు రావాల్సిందిగా ఏపీ సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. జులై-5న విచారణకు హాజరు కావాలని సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. గుంటూరులోని సీఐడీ రీజనల్‌ ఆఫీస్‌ కి జులై ఐదోతేదీ ఉదయం పదిన్నరకల్లా రావాలని తెలిపారు అధికారులు. సెక్షన్ 41-ఏ కింద వారికి నోటీసులు ఇచ్చింది సీఐడీ. ఇప్పటి వరకూ నిందితులు అనారోగ్యం నెపంతో ఇల్లు కదలకపోవడంతో సీఐడీ అధికారులే వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడిక వారిద్దరూ గుంటూరుకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నోటీసులకు A-1, A-2 ఇద్దరూ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.

పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడతారా..? సీఎం జగన్ మిమ్మల్ని మెచ్చి మేకతోలు కప్పుతాడనుకుంటున్నారా..? అంటూ ఏపీ సీఐడీ అధికారులపై టీడీపీ నేతలు మండిపడిన సంగతి తెలిసిందే. విచారణకు రాలేమంటూ నిందితులు డ్రామాలాడిన వేళ.. సీఐడీ అధికారులు పక్క రాష్ట్రంలోనే విచారణ చేపట్టిన విషయం టీడీపీ నేతలకు తెలియదా అంటూ కౌంటర్లు కూడా పడ్డాయి. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు నిందితులే పక్క రాష్ట్రానికి పరిగెత్తుకుంటూ రావాల్సి వస్తోంది. మార్గదర్శి నిందితులిద్దరూ గుంటూరులో సీఐడీ ఆఫీస్ కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విచారణకు సహకరించని నిందితులు..

నిందితులిద్దరూ విచారణకు సహకరించడంలేదని ఇప్పటికే సీఐడీ అధికారులు తెలిపారు. తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంటున్నారని, కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానమే చెప్పడం లేదన్నారు. అందుకే మరోసారి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. గుంటూరు రావాల్సిందేనని నోటీసుల్లో పేర్కొన్నారు. రామోజీ రావు, శైలజా కిరణ్ ఇద్దరికీ నోటీసులిచ్చారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఆ సంస్థకి చెందిన 1035 కోట్ల రూపాయల ఆస్తులను రెండు దశల్లో సీఐడీ సీజ్ చేసింది. మార్గదర్శి నిర్వహిస్తున్న 23 చిట్ గ్రూప్ లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ రద్దు చేసింది.

First Published:  22 Jun 2023 11:31 AM GMT
Next Story