Telugu Global
Andhra Pradesh

అనుచిత పోస్టులు ఎవరిపై పెట్టినా వదిలేది లేదు

రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకర పోస్టులు పెట్టి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని ఈ సందర్భంగా సీఐడీ చీఫ్‌ సూచించారు.

అనుచిత పోస్టులు ఎవరిపై పెట్టినా వదిలేది లేదు
X

సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల అంశంపై దృష్టి సారించామని, నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరించారు. సీఎంపై, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెడుతున్నారని, మారు పేర్లతో పెడితే ఎవరికీ తెలీదని అనుకోవడం పొరపాటని చెప్పారు. ఫేక్‌ అకౌంట్లను పట్టుకోలేమని అనుకోవడం సరికాదని, వారిని పట్టుకొని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటివారిని ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

హైకోర్టు జడ్జిలపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారని, ఇటీవల మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశంపైనా దృష్టిపెట్టామని సీఐడీ చీఫ్‌ చెప్పారు. మంత్రులపై, మహిళా నేతలపై, ప్రతిపక్ష నేతలపై.. అనుచిత పోస్టులు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని, అన్నిటినీ పరిశీలిస్తున్నామని, ఎవరినీ వదిలేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాను పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలని, దుర్వినియోగం చేయొద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

న్యాయ వ్యవస్థపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే వారి ఆస్తులు సీజ్‌ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇతర దేశాలలో ఉండి అశ్లీల, అసభ్యకర పోస్టులు పెట్టేవారిపైనా కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఆయా దేశాల ఎంబసీతో సంప్రదింపులకు సీఐడీ ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. యూకే, అమెరికా వంటి దేశాలకు సీఐడీ బృందాలను పంపినట్టు తెలిపారు.

రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకర పోస్టులు పెట్టి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని ఈ సందర్భంగా సీఐడీ చీఫ్‌ సూచించారు. హైకోర్టు న్యాయమూర్తిపై అనుచిత పోస్టింగులు పెట్టిన 19 మందికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, ఇందులో బుద్దా వెంకన్న కూడా ఉన్నారని తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు మీద గోరంట్ల రామ్‌ అకౌంట్‌ నడుపుతున్నారని, ఆయనకు నోటీసులు ఇచ్చామని వివరించారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర మెసేజ్‌లు పెట్టే 2,972 మందిపై సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్స్‌ ఓపెన్‌ చేశామన్నారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెడుతున్న అకౌంట్లను గుర్తించామని ఈ సందర్భంగా సీఐడీ చీఫ్‌ సంజయ్‌ వెల్లడించారు.

First Published:  8 Nov 2023 1:05 PM GMT
Next Story