Telugu Global
Andhra Pradesh

4 లక్షల మంది ఉద్యోగులు, 46వేల పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికలకు ఏపీ సిద్ధం

ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చని, ప్రభుత్వం ఇచ్చిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందని చెప్పారు ఏపీ సీఈఓ ముకేష్ కుమార్ మీనా.

4 లక్షల మంది ఉద్యోగులు, 46వేల పోలింగ్ కేంద్రాలు.. ఎన్నికలకు ఏపీ సిద్ధం
X

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని చెప్పారాయన. ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చని, ప్రభుత్వం ఇచ్చిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందని చెప్పారు.

4 లక్షలమంది ఉద్యోగులు..

ఏపీలో పోలింగ్ ప్రక్రియ నిర్వహణ కోసం 4 లక్షలమంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు సీఈఓ ముకేష్ కుమార్ మీనా. రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఆన్ లైన్ లోనూ నామినేషన్లు..

అభ్యర్థులు ఎవరికీ భయపడాల్సిన పనిలేదని, ఎవరి ప్రలోభాలకు గురికాకుండా ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు దాఖలు చేయొచ్చని తెలిపారు సీఈఓ ముకేషన్ కుమార్ మీనా. క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత పెంచుతామని, ఈవీఎంలు, వీవీప్యాట్‌లు ఇప్పటికే పరీక్షించామని అన్నారు. ఇప్పటి వరకు రూ.164 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు ఏపీ సీఈఓ.

First Published:  16 March 2024 12:08 PM GMT
Next Story