Telugu Global
Andhra Pradesh

ఏపీలో జరిగేది రాజధాని తరలింపు కాదు..! సీఎస్ ఏమన్నారంటే..?

రాజధానిపై కోర్టు కేసులు పెండింగ్ లో ఉండటం వల్లే సీఎస్ ఇలా స్పందించారని తెలుస్తోంది. రాజధాని విషయంలో దాగుడు మూతలు మరికొన్నాళ్లు తప్పవని మాత్రం తేలిపోయింది.

ఏపీలో జరిగేది రాజధాని తరలింపు కాదు..! సీఎస్ ఏమన్నారంటే..?
X

దసరా ముహూర్తం, కాదు కాదు డిసెంబర్ ముహూర్తం అంటూ విశాఖ రాజధాని వ్యవహారంపై ఇటీవల తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే అధికారుల కమిటీ విశాఖకు వెళ్లి భవనాలను పరిశీలించి వచ్చింది. సీఎం క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి కూడా వారు పరిశీలన చేస్తున్నారని చెప్పారు కానీ, ఆల్రడీ అది రుషికొండపై ఫిక్స్ అయిపోయిందంటూ ఎల్లోమీడియా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

సీఎస్ ఏమన్నారంటే..?

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి.. రాజధాని తరలింపుపై స్పందించారు. జీవో 2015 పై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతోంది రాజధాని తరలింపు కాదని ఆయన స్పష్టం చేశారు. అసలు రాజధాని తరలింపు అని ఎవరు చెప్పారంటూ మీడియాని ఎదురు ప్రశ్నించారు. అంటే ఇంతకాలం సీఎం జగన్ నేనొచ్చేస్తున్నా, కాపురం మార్చేస్తున్నా... అని చెప్పింది దేని గురించి అనేది తేలాల్సి ఉంది.

దాగుడు మూతలు..

ఏపీకి అమరావతితో మంచి జరిగిందా, మూడు రాజధానులతో గొప్ప మేలు జరుగుతుందా అనే విషయం పక్కనపెడితే.. అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించినమాట వాస్తవం. అమరావతిలో టీడీపీ మేత మేసిందని సగం భవనాలను అలానే వదిలేసింది వైసీపీ ప్రభుత్వం. పోనీ మూడు రాజధానుల ప్రకటన తర్వాత కనీసం మిగతా రెండు ప్రాంతాల్లో అయినా ఆ దిశగా అడుగులు పడ్డాయా అంటే అదీ లేదు. ఎప్పటికప్పుడు వాయిదా తీర్మానాలిచ్చుకుంటూ 2023 డిసెంబర్ ని తాజా ముహూర్తంగా నిర్ణయించారు. ఇప్పుడు కూడా అది రాజధాని తరలింపు కాదంటున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించే ఈ చర్చంతా అని చెప్పారాయన. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సీఎం పర్యటించినప్పుడు సమీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఆ సమయంలో అధికారిక పర్యటన కోసం వచ్చే కీలక ఉన్నత అధికారులకు సంబంధించిన కార్యాలయాలు, వారి నివాసం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అందుకే త్రిసభ్య కమిటీ నియమించామని వివరించారు.

రాజధానిపై కోర్టు కేసులు పెండింగ్ లో ఉండటం వల్లే సీఎస్ ఇలా స్పందించారని తెలుస్తోంది. ఆలోగా ముహూర్తాలు అని ముఖ్య నాయకులు హడావిడి చేయడం ఎందుకనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తానికి రాజధాని విషయంలో దాగుడు మూతలు మరికొన్నాళ్లు తప్పవని మాత్రం తేలిపోయింది.

First Published:  26 Oct 2023 1:04 AM GMT
Next Story