Telugu Global
Andhra Pradesh

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్

సీఆర్డీఏ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఇవ్వాళ జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మీడియాకు వివరించారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన 57 కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ ఫేజ్-1 ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, మౌలిక సదుపాయాలకు రూ. 1600 కోట్లు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సీఆర్డీఏ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని, తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఇవ్వాళ జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మీడియాకు వివరించారు.

కేబినెట్ భేటీలో మొత్తం 57 అంశాలకు ఆమోదం లభించినట్లు మంత్రి తెలిపారు. రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీలో రూ. 81 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కేబినెట్ ఓకే చెప్పింది. దీని వల్ల 21 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రి చెప్పారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఇటీవల వరద ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వైఎస్ జగన్ కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 679 రెవెన్యూ మండలాల్లో ఏఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ పోస్టులను డిప్యూటీ తహసీల్దార్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వేను వేగవంతం చేయడానికే ఈ సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసినట్లు చెప్పారు. కాగా, రెండేళ్ల పాటు వారికి ఈ అప్‌గ్రేడ్ వర్తిస్తుందని మంత్రి చెప్పారు. పలు జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూములు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంటల విషయంలో ఈ-క్రాప్ నమోదు చేస్తున్నాము. ఇప్పటికే 60 శాతానికి పైగా ఈ కార్యక్రమం పూర్తయ్యిందని మంత్రి చెప్పారు.

విద్యార్థులకు ట్యాబ్‌లు..

ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,72,027 మంది విద్యార్థులతో పాటు, వారికి బోధించే ఉపాధ్యాయులు దాదాపు 50 వేల మందికి ట్యాబ్‌లు మంజూరు చేయడానికి కేబినెట్ ఆమెదం తెలిపింది. ఈ ఏడాదే వారందరికీ ట్యాబ్‌లు అందుతాయని మంత్రి చెప్పారు. ఇందులో బైజూస్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ఉంటుంది. అలాగే ట్యాబ్‌కు ఏదైనా రిపేర్ వస్తే గ్రామ/వార్డు సచివాలయంలో ఇస్తే వారంలో తిరిగి రిప్లేస్ చేస్తారు. అవే ట్యాబ్‌లో సదరు విద్యార్థికి 9వ తరగతి, 10 తరగతిలో పాఠాలను అప్‌గ్రేడ్ చేస్తారని అన్నారు. వాస్తవానికి ఈ ట్యాబ్ ఖరీదు రూ. 16, 446 ఉన్నది. కానీ రివర్స్ టెండరింగ్ చేయడం వల్ల, మూడేళ్ల గ్యారెంటీతో రూ. 12,800కే అందుతుందని మంత్రి చెప్పారు. అంతే కాకుండా అందులో కేవలం ఎడ్యుకేషన్ కోసమే తప్ప వేరే వాటికి ఉపయోగించకుండా లాక్ చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

మరికొన్ని నిర్ణయాలు..

- వైఎస్ఆర్ చేయూత కార్యక్రమానికి కేబినెట్ ఆమెదం తెలిపింది.

- రిన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలసీ 2020లో సవరణలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

- భావనపాడు పోర్టు నోటిఫికేషన్-1లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

- స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

- తిరుపతి జిల్లాలో నోవాటెల్ హోటల్ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

- వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 379 మందికి 7వ దశ పరిహారం చెల్లించడానికి.. వారి పట్టాలు రద్దు చేసి భూమిని కార్పొరేషన్‌కు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

- ఏపీ టెండెన్సీ యాక్ట్ 1956ను రీపిల్ చేసే డ్రాఫ్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 20 మంది ఖైదీల విడుదలకు కేబినెట్ ఓకే చెప్పింది.

- ఏపీ జీఎస్టీ సవరణ డ్రాఫ్ట్ బిల్లు 2022కు మంత్రివర్గం ఆమోదం చెప్పింది.

- దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లపై కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.

First Published:  7 Sep 2022 12:05 PM GMT
Next Story