Telugu Global
Andhra Pradesh

వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. జనవరి 1 నుంచి పెన్షన్ల పెంపు

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత రూ.2,250కి పెన్షన్ పెంచారు. గత ఏడాది జనవరిలో మరోసారి రూ.250 పెంచారు. తాజా పెంపుతో రూ.2,750కి చేరుకున్నది.

వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. జనవరి 1 నుంచి పెన్షన్ల పెంపు
X

ఏపీలోని అవ్వా, తాతలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 2023 జనవరి 1 నుంచి వృద్ధాప్య పెన్షన్లను రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 62.31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనున్నది. చంద్రబాబు ప్రభుత్వం రూ.2,000 పెన్షన్ ఇచ్చేది. అయితే ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ జగన్ రూ.3,000 పెన్షన్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ ఏడాటా రూ.250 పెంచుతూ మూడు వేలు చేస్తానని అప్పుడే మాటిచ్చారు.

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తర్వాత రూ.250 పెన్షన్ పెంచారు. గత ఏడాది జనవరిలో మరోసారి రూ.250 పెంచారు. తాజా పెంపుతో రూ.2,750కి చేరుకున్నది. వచ్చే ఏడాది జనవరిలో మరోసారి పెంచితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3,000కు పెన్షన్ చేరుకుంటుంది. పెన్షన్లు పెంచిన విషయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు తెలియజేయాలని.. మంత్రులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.

ఇక ఎస్ఐపీబీ ఆమోదించిన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కడప జిల్లాలో భారీ పెట్టుబడులు పెట్టనున్నాయి. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కడప జిల్లాలో రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పంప్డ్ హైడ్రో స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించనున్నాయి. దీనికి కూడా ఆమోద ముద్ర పడింది. ఎస్ఐపీబీ మొత్తం రూ.23,985 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

ఇక నాడు-నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్‌లో టీవీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 8వ తరగతి విద్యార్థులకు ఈ-కంటెంట్ అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉపాధ్యాయులకు బోధనేతర విధుల రద్దు జీవోకు మంత్రివర్గ ఆమోదం లభించింది. ఎన్టీఆర్ జిల్లా వీరుల పాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అలాగే 1301.38 చదరపు కిలోమీటర్ల పరధితో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్ చట్టంలో సవరణలను కూడా కేబినెట్ ఆమోదించింది.

First Published:  13 Dec 2022 10:17 AM GMT
Next Story