Telugu Global
Andhra Pradesh

పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీకే పరిమితం అవుతారని జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని కిరణ్ సమాధానం ఇచ్చారు. పార్టీ అధిష్టానం తెలంగాణ, ఆంధ్రాలలో ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేస్తానన్నారు.

పార్టీ ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తా.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
X

బీజేపీ అధిష్టానం ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ సొంత పార్టీ పెట్టి ఘోరంగా విఫలం చెందారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో తిరిగి చేరినప్పటికీ మునుపటిలా పనిచేయలేదు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కొన్ని నెలల కిందట బీజేపీలో చేరారు. కనీసం బీజేపీలో చేరిన తర్వాత అయినా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారని అంతా భావించారు. అయితే పార్టీలో చేరిన వెంటనే కర్ణాటక ఎన్నికల నిర్వహణపై పార్టీ పెద్దలతో జరిగిన చర్చల్లో పాల్గొన్న కిరణ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు.

కొన్ని నెలల గ్యాప్ తర్వాత ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి మధుకర్ ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ బలోపేతంపై చర్చించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరిన తర్వాత తాను నెలరోజులపాటు అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. ముందస్తుగానే నిర్ణయించుకోవడంతో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీకే పరిమితం అవుతారని జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని కిరణ్ సమాధానం ఇచ్చారు. పార్టీ అధిష్టానం తెలంగాణ, ఆంధ్రాలలో ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేస్తానన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనపై స్పందిస్తానని చెప్పారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను కిరణ్ కుమార్ రెడ్డికి వివరించినట్లు చెప్పారు. అలాగే ఆయన నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలిపారు. కిరణ్ దగ్గర పార్టీ బలోపేతానికి సంబంధించి మంచి కార్యాచరణ ఉందని.. ఆయన మార్గ నిర్దేశంలో పనిచేస్తామని సోమ వీర్రాజు చెప్పారు.

First Published:  31 May 2023 3:19 PM GMT
Next Story