Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరి ఎందుకు దూరంగా ఉన్నట్లు?

బంద్‌కు బీజేపీ మద్దతుందని ప్రచారంలో ఉన్న లేఖ ఫేక్ అని ప్రకటించారు. ఆ ఫేక్ లేఖను సర్క్యులేషన్లోకి తెచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పురందేశ్వరి ఎందుకు దూరంగా ఉన్నట్లు?
X

ఇప్పుడు ఇదే విషయం ఎవరికీ అర్థంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అవినీతికి పాల్పడినందుకు ఏసీబీ కోర్టు చంద్రబాబునాయుడుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇందుకు నిరసనగా టీడీపీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చింది. ఈ బంద్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా పాజిటివ్‌గానే స్పందించారు.

అయితే బీజేపీ అధ్య‌క్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విరుద్ధంగా వ్యవహరించారు. పైగా బంద్‌కు బీజేపీ మద్దతుందని ప్రచారంలో ఉన్న లేఖ ఫేక్ అని ప్రకటించారు. ఆ ఫేక్ లేఖను సర్క్యులేషన్లోకి తెచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే పురందేశ్వరి వైఖరిపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అధ్యక్షురాలు అయిన దగ్గర నుండి పురందేశ్వరి ప్రతి మాట, చేత చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటున్నది. ఈ విషయంలో పురందేశ్వరి వైఖరిపై పార్టీ నేతల్లో అసంతృప్తి మొదలైనా ఆమె పట్టించుకోవటంలేదు.

రాష్ట్ర అప్పులపైన, టిడ్కో ఇళ్ళ నిర్మాణంపైనా, లా అండ్ ఆర్డర్‌తో పాటు పథకాల అమలు తదితరాల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలనే పురందేశ్వరి పదేపదే చేస్తున్నారు. పైగా రాష్ట్ర అప్పులపై కేంద్ర ఆర్థికశాఖ నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనే తప్పనేంతగా పురందేశ్వరి మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐదేళ్ళ హయాంలో చంద్రబాబు ఎంతటి అవినీతికి పాల్పడినా పురందేశ్వరి నోరిప్పలేదు. చంద్రబాబు అవినీతిపై నరేంద్రమోడీ స్వయంగా ఆరోపించినా పురందేశ్వరి మాత్రం స్పందించలేదు.

అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల వెళ్ళినపుడు కాన్వాయ్ పై కర్రలు, చెప్పులతో టీడీపీ దాడి చేసినప్పుడు పట్టించుకోలేదు. అధ్యక్షురాలైన దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వంపైన కూడా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పురందేశ్వరి టీడీపీ ఇచ్చిన బంద్‌కు మద్దతు పలుకుతారని అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్టును కూడా ఆమె ఖండించారు. అయితే బంద్‌కు తమ పార్టీకి సంబంధం లేదని ఆమె ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే అగ్రనేతల నుండి ఏమన్నా అక్షింతలు పడ్డాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.


First Published:  11 Sep 2023 4:25 AM GMT
Next Story