Telugu Global
Andhra Pradesh

హమ్మయ్య ఏపీ బీజేపీకి ఓ అవకాశం దక్కింది..

దళిత క్రిస్టియన్‌ లకు ఎస్సీ హోదా కల్పించాలంటూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు.

హమ్మయ్య ఏపీ బీజేపీకి ఓ అవకాశం దక్కింది..
X

ఏపీలో బీజేపీ రాజకీయం అస్సలేమాత్రం బాగోలేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి పోస్ట్ మార్టమ్ చేస్తే చిత్ర విచిత్ర కారణాలు వెల్లడయ్యాయి. తాము వైసీపీకి బీటీమ్ అనుకుని ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారని, అందుకే ఓట్లు పడలేదని సెలవిచ్చారు ఏపీ బీజేపీ నేతలు. అందుకే ఇకపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడతామని జబ్బలు చరిచారు. చార్జ్ షీట్ వేస్తామన్నారు. అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామన్నారు. అలా అన్నారో లేదో వారికి ఓ అవకాశం వచ్చింది. దళిత క్రిస్టియన్‌ లకు ఎస్సీ హోదా కల్పించాలంటూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు దీన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు,

వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలని విమర్శించారు. దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు జీవీఎల్.

దేశవ్యాప్తంగా మత రాజకీయాలు చేస్తున్న బీజేపీకి ఏపీలో అది సాధ్యం కావడంలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, రాష్ట్రవ్యాప్తంగా రథాలు తగలబడిన ఘటనలు జరగడంతో అప్పట్లో రథయాత్ర అంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందంటూ కొన్నిరోజులు రోడ్లపైకి వచ్చారు. ఏదీ కుదరకపోవడంతో ఇప్పుడు, దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ అడ్డుకుంటామని అంటోంది. ఏపీ అసెంబ్లీలో చేసింది కేవలం తీర్మానం మాత్రమే, కేంద్రం ఆమోదం కోసం దాన్ని పంపించారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఇందులో ఇక ఆలోచించాల్సిందేముంది. కానీ ఏపీలో వైసీపీని బీజేపీ ఎదుర్కొంటోంది అనే బిల్డప్ కోసమే కాషాదయళం కష్టపడుతోంది. వైసీపీకి అసలైన ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ నేతలకు అటు జనసేన కూడా హ్యాండివ్వడంతో దిక్కుతోచడంలేదు. ఏపీలో బీజేపీ రాజకీయం పూర్తిగా అయోమయంగా ఉంది.

First Published:  25 March 2023 1:44 PM GMT
Next Story