Telugu Global
Andhra Pradesh

'స్టార్' నాయకుడి కోసం బీజేపీ అన్వేషణ.. బెడిసికొడుతున్న ప్రయత్నాలు!

ఏవరైనా సినిమా స్టార్‌ను ఏపీ బీజేపీకి అధ్యక్షుడిని చేయడమో.. లేదంటే స్టార్ క్యాంపెయినర్‌గా నియమించడమో చేస్తే పార్టీలో ఉత్సాహం వస్తుంది. అందుకే ఇద్దరు బడా స్టార్‌లతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

స్టార్ నాయకుడి కోసం బీజేపీ అన్వేషణ.. బెడిసికొడుతున్న ప్రయత్నాలు!
X

ఏపీ బీజేపీని నడిపించడానికి ఇప్పుడు ఒక 'స్టార్' నాయకుడు కావాలి. తెలంగాణలో కిందా మీదా పడి ఎలాగో పార్టీని నడిపించగలిగే నాయకులు ఉన్నారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి దూకుడైన నాయకులు లేకపోవడంతో అధిష్టానం తలపట్టుకుంటోంది. అధికార వైసీపీపై దూకుడుగా వెళ్లకపోయినా.. కనీసం పార్టీని బలపరిచి, నడిపించే సత్తా ఇప్పుడు ఉన్న నాయకుల్లో లేదని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ఎవరైనా జనాకర్షక నేతను పార్టీలోకి తీసుకొని వస్తే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని అంచనా వేస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ వంటి సీనియర్ నేతకు పగ్గాలు అప్పగించినా.. బీజేపీ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు వద్ద అంత సత్తా లేదని భావిస్తోంది.

ఏవరైనా సినిమా స్టార్‌ను ఏపీ బీజేపీకి అధ్యక్షుడిని చేయడమో.. లేదంటే స్టార్ క్యాంపెయినర్‌గా నియమించడమో చేస్తే పార్టీలో ఉత్సాహం వస్తుంది. అందుకే ముగ్గురు బడా స్టార్‌లతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. ముఖ్యంగా చిరంజీవిని ఏపీ బీజేపీని నడిపించాలని కోరినట్లు తెలుస్తున్నది. ఇటీవల ప్రధాని పర్యటనలో బీజేపీ చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇతర పార్టీ నాయకులకు కూడా అందని ఆహ్వానపత్రం చిరంజీవికి వచ్చింది. బీజేపీలో చేరితే భవిష్యత్ బాగుంటుందని చిరంజీవికి నచ్చ చెప్పటానికి ప్రయత్నించింది.

ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో ఏపీలో రాజకీయం చేస్తున్నారు. ఈ సమయంలో తాను బీజేపీలో చేరడం సరి కాదని చిరంజీవి చెప్పినట్లు తెలుస్తున్నది. తమ్ముడికే తన మద్దతు ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చి పారేశారు. ఒక వేళ వచ్చినా.. చచ్చే వరకు టీడీపీతోనే ఉంటానని గతంలోనే స్పష్టం చేశారు. ప్రభాస్‌ను బీజేపీలోకి తీసుకొని రావడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ బంగారం లాంటి కెరీర్ చెడగొట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి దిగే ఆలోచన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు లేదని సన్నిహితులు చెబుతున్నారు. వాళ్ల అన్నకు బీజేపీ టికెట్ ఇచ్చినా.. ప్రచారం చేస్తాడో లేదో అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

దక్షిణాది స్టార్లను పార్టీలోకి తీసుకొని రావాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో రజనీకాంత్‌ను బీజేపీలో చేరాలని పలు మార్లు చర్చలు జరపింది. కానీ అవన్నీ విఫల యత్నాలే అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్‌లు కూడా బీజేపీలో చేరడానికి విముఖత చూపిస్తున్నారు. అగ్రనాయకులతో భేటీ అంటే షూటింగ్ ఉందని తప్పించుకుంటున్నట్లు తెలుస్తున్నది. అల్లు అర్జున్ వంటి క్రౌడ్ పుల్లర్స్‌ను కూడా సంప్రదించాలని ప్రయత్నించినా.. వాళ్లకు రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్లు ముందుగానే సంకేతాలు పంపారు. ఏపీలో పార్టీని ఎలాగైనా ఉరుకులు పెట్టించాలని అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. బీజేపీని బలోపేతం చేయాలని ఎన్ని ప్లాన్లు వేస్తున్నా.. అవి వర్కవుట్ కాకపోవడంతో ఏం చేయాలో అధిష్టానానికి పాలుపోవడం లేదు.

First Published:  24 Nov 2022 3:05 AM GMT
Next Story