Telugu Global
Andhra Pradesh

ఆపరేషన్ సక్సెస్, బట్..

వీర్రాజుపై ఫిర్యాదులను రాతపూర్వ‌కంగా ఇవ్వటమంటే అనవసరంగా కమిట్ అయినట్లే అని అసమ్మతి నేతలు భావిస్తున్నారు. అందుకనే రాతపూర్వ‌కంగా ఇవ్వకుండానే అందరు వెనక్కు తిరిగొచ్చేశారు.

ఆపరేషన్ సక్సెస్, బట్..
X

ఢిల్లీలో ఏపీ బీజేపీ నేతల పరిస్థ‌తి ఇలాగే తయారైంది. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డైడ్’ అన్న సామెతలాగ నేతలకు ఏమిచేయాలో దిక్కుతెలియ‌క చివరకు రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీద ఫిర్యాదులు చేయ‌డం, అధ్యక్షుడి మార్పుపై హామీ తీసుకోవటం లాంటి అనేక డిమాండ్లతో కొందరు నేతలు ఢిల్లీకి వెళ్ళారు. కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో చాలాసేపు భేటీ అయ్యారు. భేటీలో ఫిర్యాదులైతే చేశారు కానీ అటువైపు నుండి ఎలాంటి హామీ లభించలేదు.

పైగా శనివారం తాను రాజమండ్రికి వస్తున్నానని అక్కడే అన్నీ విషయాలు మాట్లాడుకుందామని చెప్పి పంపేశారు. అంతేకాకుండా నేతలు చేసిన ఫిర్యాదులన్నింటినీ రాతపూర్వ‌కంగా ఇవ్వాలని కేంద్రమంత్రి అడిగేసరికి అసమ్మతి నేతల గొంతులో వెలక్కాయపడినట్లయ్యింది. కేంద్రమంత్రి రాష్ట్ర పర్యటనలో అధ్యక్షునిపై ఫిర్యాదులు చేయటం పైగా రాత‌పూర్వ‌కంగా ఇవ్వటం వీళ్ళకి ఇష్టంలేదు. ఎందుకంటే కేంద్రమంత్రి పర్యటనంటే పక్కనే రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉంటారు.

వీర్రాజుపై ఫిర్యాదులను రాతపూర్వ‌కంగా ఇవ్వటమంటే అనవసరంగా కమిట్ అయినట్లే అని అసమ్మతి నేతలు భావిస్తున్నారు. అందుకనే రాతపూర్వ‌కంగా ఇవ్వకుండానే అందరు వెనక్కు తిరిగొచ్చేశారు. అసమ్మతి నేతలను కలవటానికి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టపడలేదు. వివిధ రాష్ట్రాల్లో జరుగబోతున్న ఎన్నికలను కారణంగా చూపించి వీళ్ళకు అపాయిట్మెంట్ ఇవ్వలేదు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక వెనక్కి వచ్చేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే వీర్రాజు వల్ల పార్టీ బలోపేతమయ్యేది లేదు దెబ్బతినేదీ లేదు. పార్టీ ఎదుగుదలకు వచ్చిన అవకాశాలను గతంలో కొందరు అగ్రనేతలు నాశనం చేసేశారు. ఇతర పార్టీలకు బీజేపీని తోకపార్టీగా మార్చేశారు. 2014 నుండి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా పార్టీపై జనాలు మండిపోతున్నారు. ఇలాంటి అనేక అంశాల కారణంగా పార్టీ బలోపేతమవ్వటంలేదు. పైగా ఇప్పుడు పార్టీలో అగ్రనేతలుగా చెలామణి అవుతున్న వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్, పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకు అసలు జనాల్లో బలమేలేదు. ఇలాంటి నేతలు పెత్తనం చేస్తుంటే ఇక పార్టీ బలపడేదెప్పుడు?

First Published:  24 Feb 2023 5:54 AM GMT
Next Story