Telugu Global
Andhra Pradesh

అధిష్టానం వ‌ద్దంటున్నా పొత్తు కోసం ఏపీ బీజేపీ నేత‌ల ఉబ‌లాటం!

శివ‌ప్ర‌కాష్‌ను క‌లిసిన అనంత‌రం ప‌లువురు నేత‌లు పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణ‌య‌మ‌ని ప్ర‌క‌టిస్తూనే క‌లిసి వెళితే బాగుంటుంద‌నేలా మాట్లాడారు.

అధిష్టానం వ‌ద్దంటున్నా పొత్తు కోసం ఏపీ బీజేపీ నేత‌ల ఉబ‌లాటం!
X

నిన్న 195 లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క స్థానానికీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ‌లో 9 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌కటించినా ఏపీ వైపు మాత్రం చూడ‌లేదు. గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే చంద్ర‌బాబును, ఆయ‌న్ను గుడ్డిగా స‌మ‌ర్థిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం లైట్ తీసుకుంటున్న‌ట్లే క‌నిపిస్తోంది. పొత్తు లేకుండా ఒంట‌రిగా వెళదామ‌నే ఆలోచ‌న క‌మ‌ల ద‌ళ‌ప‌తుల్లో ఉంద‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. కానీ, ఆ పార్టీ ఏపీ నేత‌లు మాత్రం పొత్తు కోసం ఉబ‌లాట‌ప‌డుతున్నారు.

కేంద్ర క‌మిటీ ప్ర‌తినిధి ముందూ అదే మాట‌!

ఏపీ బీజేపీ టికెట్లు ఆశిస్తున్న ఆశావ‌హుల‌తో ఆ పార్టీ కేంద్ర సంఘ‌ట‌నా స‌హ కార్య‌ద‌ర్శి శివ‌ప్ర‌కాష్ శ‌నివారం విజ‌య‌వాడ‌లో వ‌రుస‌గా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కూడా ప‌లువురు నేత‌లు ఆయ‌న వ‌ద్ద పొత్తు గురించి ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న దానికేమీ స‌మాధాన‌మివ్వ‌క‌పోగా రాష్ట్రంలో ఒక్క వైసీపీనే ఎందుకు విమ‌ర్శిస్తున్నారని నేత‌ల్ని ఎదురుప్ర‌శ్నించిన‌ట్లు తెలియ‌వ‌చ్చింది. వైసీపీతో స‌హా ఇత‌ర పార్టీల‌కూ స‌మ‌దూరం పాటించాల‌ని ఆయ‌న సుతిమెత్త‌గా హెచ్చ‌రించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

పొత్తును ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్న విష్ణుకుమార్ రాజు

శివ‌ప్ర‌కాష్‌ను క‌లిసిన అనంత‌రం ప‌లువురు నేత‌లు పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణ‌య‌మ‌ని ప్ర‌క‌టిస్తూనే క‌లిసి వెళితే బాగుంటుంద‌నేలా మాట్లాడారు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్ల‌డం వ‌ల్ల తాను విశాఖ నార్త్‌లో గెలిచాన‌ని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు మీడియాతో అన్నారు. ఈసారీ తాను అక్క‌డి నుంచే పోటీ చేస్తానన్నారు. పొత్తును ప్ర‌జలు కోరుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. పార్టీ ఎలా పోయినా పొత్తులో కొన్ని సీట్ల‌న్నా గెలుచుకోక‌పోతామా, ఎమ్మెల్యే, ఎంపీ కాక‌పోతామా అని బీజేపీ రాష్ట్ర నేత‌లు భావిస్తున్నార‌ని ఆ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వానికి సంకేతాలు అందుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పొత్తుపై పార్టీ నిర్ణ‌యం ఆస‌క్తిక‌రంగా మారుతోంది.

First Published:  3 March 2024 7:53 AM GMT
Next Story