Telugu Global
Andhra Pradesh

మేం వైసీపీపై పోరాడుతుంటే.. మీరొచ్చి వాళ్లను మెచ్చుకుంటారా?

ఒకవైపు రాష్ట్ర నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే మంత్రులు, నాయకులు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాలకు దారి తీస్తోంది.

మేం వైసీపీపై పోరాడుతుంటే.. మీరొచ్చి వాళ్లను మెచ్చుకుంటారా?
X

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, కేంద్రంలోనీ బీజేపీతో చాలా సన్నిహితంగా ఉంటుందనేది బహిరంగ రహస్యమే. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు బీజేపీ అధిష్టానంతో దగ్గరి సంబంధాలు కొనసాగిస్తుండగా.. రాష్ట్ర బీజేపీ మాత్రం ప్రతినిత్యం ఆయనపై విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్ లాంటి వారు వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. మద్యం నుంచి ఇసుక టెండర్ల వరకు వైసీపీ చేస్తున్న అక్రమాలను ఎత్తిచూపుతుంటారు. సంక్షేమ పథకాలపై కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు ఏదో ఒక రూపంలో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. సీఎం జగన్ జాతీయ నాయకులతో సన్నిహితంగా ఉంటారేమో, కానీ మేము మాత్రం వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నామని బీజేపీ నాయకులు అంటున్నారు.

ఒకవైపు రాష్ట్ర నాయకులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. ఢిల్లీ నుంచి వచ్చే మంత్రులు, నాయకులు మాత్రం జగన్ ప్రభుత్వాన్ని పొగడటం వివాదాలకు దారి తీస్తోంది. మేము వైసీపీపై పోరాడుతుంటే.. మీరు వచ్చి వాళ్లను పొగుడుతుంటే ప్రజలకు ఎలాంటి సందేశం వెళ్తుందని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయి యుద్ధానికి దిగిన సమయంలోనే కేంద్రం నుంచి ఎవరో ఒకరు వచ్చి వారికి అనుకూల వ్యాఖ్యలు చేయడం పరిపాటి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేంద్ర మంత్రులు ఎల్. మురుగన్, గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చి నాడు-నేడు, తాగునీటి వసతులు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. అప్పటి వరకు పాఠశాలల తరలింపుపై విమర్శలు చేసిన రాష్ట్ర నాయకులకు వారి ప్రశంసలు ఇబ్బందికరంగా మారాయి.

తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వైసీపీ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం చాలా బాగుందని కితాబిచ్చారు. ప్రజాప్రతినిధులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కేవలం ఓట్లు అడగడానికే ప్రజల వద్దకు వెళ్లవద్దని.. ఇలా మధ్యలో కూడా వెళ్లి తాము చేస్తున్న పనులు ఎలా ఉన్నాయని కనుక్కోవడం మంచిదని చెప్పారు. పథకాలు అమలవుతున్న తీరును తెలుసుకోవడమే కాకుండా.. అందని వారికి వెంటనే అందజేసే వీలుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ నాయకులను ఇబ్బందులకు గురి చేసింది. ఇప్పటికే బీజేపీని రాష్ట్రంలో జనాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. వైసీపీతో కలిసిపోయిందని విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చెప్పుకోదగిన సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉంటే.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం బాగాలేదని అంటున్నారు. తమ జాతీయ నాయకులే తమకు అడ్డంకిగా మారారని తలలు పట్టుకుంటున్నారు.

First Published:  8 Oct 2022 3:55 AM GMT
Next Story