Telugu Global
Andhra Pradesh

ఏపీ బీజేపీలో కేటుగాడు.. సొంత పార్టీ నేతలకే 30కోట్ల టోకరా..

గతంలో టీడీపీలో ఉంటూ, ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయిన ఈ మాయగాడు.. నామినేటెడ్ పోస్ట్ లు, నియోజకవర్గ ఇన్ చార్జ్ పోస్ట్ లు అంటూ సొంత పార్టీ నేతల దగ్గరే డబ్బులు కాజేశాడు.

ఏపీ బీజేపీలో కేటుగాడు.. సొంత పార్టీ నేతలకే 30కోట్ల టోకరా..
X

చెప్పుకుంటే పరువుపోతుంది, కానీ చెప్పుకోక తప్పదు అన్నట్టుగా ఉంది బీజేపీ నేతల పరిస్థితి. మింగలేక, కక్కలేక, చివరకు సొంత పార్టీ పరువు బజారున పడేసుకున్నారు. పార్టీ పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాడిపై ఏపీలో సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేటుగాడు ఏపీ బీజేపీకి చెందిన నేత. గతంలో టీడీపీలో ఉంటూ, ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంప్ అయిన ఈ మాయగాడు.. నామినేటెడ్ పోస్ట్ లు, నియోజకవర్గ ఇన్ చార్జ్ పోస్ట్ లు అంటూ సొంత పార్టీ నేతల దగ్గరే డబ్బులు కాజేశాడు.

4 రాష్ట్రాల బాధితులు..

85మంది బాధితులు, 30 కోట్ల మేత. ఇదీ క్లుప్తంగా ఆ నేత పనితీరు. జస్ట్ రెండున్నరేళ్ల కాలంలో కేవలం మాటలతో మాయచేసి ఈ డబ్బు కాజేశాడు. బీజేపీలో రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న ఆ నాయకుడు ఏపీ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారిని మాటలతో బురిడీకొట్టించి డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. కేంద్రంలో నామినేటెడ్ పోస్ట్, రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవులు ఇప్పిస్తానంటూ నమ్మబలుకుతాడు. కేంద్రంలో తనకున్న పలుకుబడులను ఉపయోగించుకుని, కేంద్ర నాయకులతో దిగిన ఫొటోలను చూపించుకుంటూ వ్యవహారం నడిపిస్తాడని తెలుస్తోంది. ఈ మాయమాటలు నమ్మిన బాధితులు అడ్వాన్స్ లు ఇచ్చారు. తీరా ఆయన చెప్పిన నామినేటెడ్ పోస్ట్ రాకపోవడంతో లబోదిబోమంటూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీలో పదవులకోసం లంచాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తే నాలుక కరుచుకున్నారు. చాలామంది తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ గా ఉన్నా, కొందరు ధైర్యం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు.

ఎలా బయటపడిందంటే..?

తమిళనాడులో తీగ కదిలింది. అడ్వాన్స్ లు ఇచ్చిన కొందరు బాధితులు అక్కడి నాయకులకు ఈ విషయం చెప్పగా, వారు ఏపీ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీలో కూడా బాధితులు రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం కన్ఫామ్ అని నిర్థారణ అయింది. ఆ నాయకుడి అరెస్ట్ ఖాయం అనుకుంటున్న టైమ్ లో ఢిల్లీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఇక్కడ మేనేజ్ చేయాలని చూస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే.. సదరు నాయకుడు దొంగ కార్ల విక్రయంలో కూడా అందె వేసిన చేయి అంటున్నారు. దొంగ కార్లను తక్కువరేటుకి కొనుగోలు చేసి, తన పలుకుబడితో నెంబర్ ప్లేట్లను మేనేజ్ చేసి వాటిని చౌకగా అమ్మేస్తూ కేంద్రంలో చాలామందికి దగ్గరయ్యాడట.

ఎవరా ఎంపీ..?

ఈ నాయడుకిడి ఓ ఎంపీ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఎంపీకి కూడా ఈ దందాలో వాటా ఉన్నట్టు చెబుతున్నారు. కేంద్రంలో పెద్దల్ని మేనేజ్ చేసి, సదరు కేటుగాడిపై వేటు పడకుండా చూస్తూనే, ఇటు ఏపీ పోలీసులకు కూడా అరెస్ట్ లు వద్దంటూ రాయబారం పంపారట. బాధితుల డబ్బులు తిరిగి చెల్లిస్తామని ఒప్పందం చేసుకుంటున్నట్టు సమాచారం. దీంతో పోలీసులు కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గారట. అరెస్ట్ కి ఇప్పుడల్లా అవకాశం లేదని తెలుస్తోంది. బాధితులకు డబ్బులు కావాలి, సదరు నాయకుడికి, ఆయన పార్ట్ నర్ అయిన ఎంపీకి పరువు పోకుండా ఉండాలి. దీంతో ఈ వ్యవహారం మధ్యలోనే సెటిల్ అయిపోయేలా కనిపిస్తోంది.

బీజేపీ పదవులకు కూడా పోటీయా..?

ఏపీలో బీజేపీ జీరో అని అందరికీ తెలిసినా నామినేటెడ్ పోస్ట్ లకు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు గిరాకీ ఉన్నట్టు తెలుస్తోంది. అటు తమిళనాడులో కూడా చాలామంది అమాయకులు.. మెడలో కాషాయ జెండా వేసుకుని, కారుపై ఏదో ఒక నేమ్ బోర్డ్ రాయించుకోడానికి ఉబలాటపడుతున్నారు. బీజేపీలో చాలా ఉప విభాగాలున్నాయి, అందులో ఏదో ఒక పోస్ట్ ఇప్పించేస్తానంటూ ఈ ఆశావహుల్ని మోసం చేశారు ఏపీ నేతలు. చివరకు 30కోట్ల స్కామ్ బయటపడేసరికి.. రాజీకి దిగొచ్చారు.

First Published:  6 Sep 2022 4:54 AM GMT
Next Story