Telugu Global
Andhra Pradesh

కన్నా చేరికకు ముహూర్తం ఫిక్స్, ఆ భయంతోనే జనసేనకు దూరం

జనసేన బీజేపీతో కలిసి ఉండటం, ఆ పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తుంది అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరడమే ఉత్తమమని కన్నా అనుచరులు అభిప్రాయపడ్డారు.

కన్నా చేరికకు ముహూర్తం ఫిక్స్, ఆ భయంతోనే జనసేనకు దూరం
X

ఊహించినట్టుగానే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. ఈనెల 23న చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఈనెల 16న బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించేందుకు గుంటూరులోని తన నివాసంలో అనుచరులతో సమావేశం నిర్వహించారు. వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.

అనంతరం తన అనుచరుల సూచన మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వంతోనూ కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. టిడిపి కూడా తనను చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్టు తన అనుచరులకు వివరించారు. టిడిపి, జనసేన ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అన్నదానిపై సమావేశంలో చర్చ జరిగింది. చాలామంది అనుచరులు ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపినే బెటర్ అని సూచించారు.

జనసేన బీజేపీతో కలిసి ఉండటం, ఆ పార్టీ ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేస్తుంది అన్నదానిపై స్పష్టత లేకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరడమే ఉత్తమమని కన్నా అనుచరులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ టీడీపీ- జనసేన మధ్య పొత్తు కుదరకపోతే, అలాంటి పరిస్థితుల్లో జనసేన నుంచి పోటీ చేస్తే మరోసారి తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని సమావేశంలో అనుచరులు గట్టిగా వాదించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ.. రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయగల సమర్థత ఒక చంద్రబాబుకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థ‌కంగా మారిందన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటానికి తన వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తారకరత్న చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇతర విషయాల గురించి తాను ఎక్కువగా మాట్లాడబోనని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఈనెల 23న మధ్యాహ్నం గుంటూరులోని కన్నా వారి తోట నుంచి ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీగా కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళనున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించిన సమావేశానికి పెదకూరపాడు, సత్తెనపల్లి, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గం నుంచి అనుచరులు హాజరయ్యారు. తొలుత జనసేనలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ భావించినప్పటికీ ఆ పార్టీ పొత్తులపై ఒక స్పష్టత లేకపోవడం వల్లనే ఆయన వెనక్కు తగ్గారన్నది ప్రధానంగా వినిపిస్తున్న కారణం. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కనీస స్థాయిలో కూడా ఉపయోగం ఉండదన్న నిర్ధారణకు కన్నా వచ్చిన తర్వాతనే టిడిపి వైపు మొగ్గు చూపినట్టు భావిస్తున్నారు.

First Published:  20 Feb 2023 3:47 AM GMT
Next Story