Telugu Global
Andhra Pradesh

పాపం పురందేశ్వరి

ఏ చిన్న అవకాశం దొరికినా, టీడీపీతో పొత్తుండాల్సిందే అన్న వాదనను వినిపిస్తున్నారట. మీడియా సమావేశాల్లో మాత్రం పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నేతలే తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

పాపం పురందేశ్వరి
X

‘మేం జాబితాలను సిద్ధంచేశాం.. రెండురోజుల్లో కేంద్ర పెద్దలకు పంపుతాము.. పొత్తులుంటే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలే ఆ విషయాన్ని ప్రకటిస్తారు.. దానికి అనుగుణంగానే మా కార్యాచరణ ఉంటుంది.’ ఇది తాజగా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి చెప్పిన మాటలు. పైకి ఒకలా మాట్లాడుతున్న పురందేశ్వరి లోలోపల మాత్రం చంద్రబాబు నాయుడుతో పొత్తుకు తనవంతు ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే టీడీపీతో పొత్తుండాల్సిందే అని పార్టీలోని పెద్దల దగ్గర పదేపదే చెబుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే పార్టీ పెద్దలను పొత్తుకు అనుగుణంగా ఒప్పించేంత సీన్ పురందేశ్వరికి లేదు.

అందుకనే ఏ చిన్న అవకాశం దొరికినా, టీడీపీతో పొత్తుండాల్సిందే అన్న వాదనను వినిపిస్తున్నారట. మీడియా సమావేశాల్లో మాత్రం పొత్తులపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర నేతలే తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. టీడీపీతో పొత్తువద్దని ఒకవేళ కేంద్రంపెద్దలు నిర్ణయం తీసుకుంటే అప్పుడు పురందేశ్వరి ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే టీడీపీతో పొత్తుంటేనే ఎన్నికల్లో గెలుపుపై ఆశ ఉంటుంది. లేకపోతే డిపాజిట్ కూడా రాదని ఆమెకు బాగా తెలుసు. పోయిన ఎన్నికల్లో వైజాగ్ లోక్ సభ సీటునుండి పురందేశ్వరి పోటీచేస్తే డిపాజిట్ కూడా దక్కలేదు.

అంతకుముందు రాజంపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. కాబట్టి వచ్చేఎన్నికల్లో గెలవాలంటే టీడీపీతో పొత్తుండాల్సిందే. ఈ విషయంలోనే ఆమె లోలోపల టీడీపీతో పొత్తుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. టీడీపీతో పొత్తుంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ విశాఖపట్నం పార్లమెంటు సీటులో పోటీచేయాలన్నది ఆమె ప్రయత్నం. ఇదే సీటులో పోటీకి పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇక్కడ పార్టీలో ఒక సమస్యుంది. అదేమిటంటే ఒరిజినల్ బీజేపీ నేతలేమో టీడీపీతో పొత్తు వద్దంటున్నారట. ఒరిజినల్ అంటే మొదటినుండి అంటే దశాబ్దాలుగా బీజేపీలోనే ఉన్నవారు. వీళ్ళందరికీ చంద్రబాబుతో పొత్తంటే ఎలాగుంటుందో బాగా అనుభవమే. అందుకనే పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక రెండో రకం నేతలు ఎవరంటే అవసరార్ధం బీజేపీలో చేరినవారు. అంటే సుజనాచౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి లాంటి వాళ్ళన్నమాట. ఇలాంటి వాళ్ళంతా చంద్రబాబుతో పొత్తుండాల్సిందే అని బలంగా వాదిస్తున్నారు. టీడీపీతో పొత్తును బహిరంగంగా సమర్ధించలేక, అలాగని పూర్తిగా జాతీయ నాయకత్వానికి వదిలేయలేక, పార్టీలో డెవలప్మెంట్లను చూస్తు ఊరుకోలేక పురందేశ్వరి నానా అవస్తలు పడుతున్నారని అర్ధమైపోతోంది.

First Published:  4 March 2024 6:46 AM GMT
Next Story